ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని
బంగారం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన వస్తువు. సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని పరిగణించడం వల్ల ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. బంగారం ధరలు ఆకాశాన్ని తాకేలా పరుగులు పెడుతున్న సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనిని గుర్తించారు. భూమిపై అతిపెద్ద బంగారు నిక్షేపం తమకు దొరికేసిందని చైనా పేర్కొంది.
1,000 మెట్రిక్ టన్నుల ప్రీమియం బంగారు గనిని తాము తమ దేశంలో గుర్తించామని చైనా వెల్లడించింది. హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్‌జియాంగ్ కౌంటీలో ఉన్న బంగారు గనిలో సుమారు ₹7 లక్షల కోట్లు (600 బిలియన్ యువాన్) విలువైన బంగారం ఉందని అంటున్నారు. దీంతో ఇప్పుడు ప్రపంచ గనుల నిర్వచనాలు మళ్లీ మారాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని దొరికేసింది
చైనాలో గుర్తించిన ఈ భారీ బంగారు గని రికార్డుల మోత మోగిస్తోంది. ఇది దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ గోల్డ్ మైన్ ను అధిగమించింది. దీనికి ముందు 930 మెట్రిక్ టన్నులతో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిక్షేపంగా దక్షిణాఫ్రికా బంగారు గనిని పరిగణించేవారు.
కానీ ఇప్పుడు చైనా బంగారు గనిలో 2 కిలోమీటర్ల లోతులో 300 మెట్రిక్ టన్నుల బంగారం ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. దీనికోసం నిర్వహించిన అధికారిక సర్వేలో అధునాతన 3D భూగర్భ శాస్త్ర సాంకేతికతను ఉపయోగించారు. దాని ప్రకారం 3 కిలో మీటర్ల లోతు వరకు బంగారం ఉండవచ్చని చెబుతున్నారు.
చైనాలో బంగారు నిక్షేపాలు
హునాన్ భూగర్భ శాస్త్ర బ్యూరో ఉపాధ్యక్షుడు లియు యోంగ్‌జున్ ఈ విషయం గురించి మాట్లాడుతూ, “ఈ ఆవిష్కరణ చైనా గనుల తవ్వకానికి ఒక ముఖ్యమైన ఘట్టం” అని అన్నారు. భూగర్భ నిధి పెట్టెను బయటకు తీసుకురావడానికి 3D మోడలింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ప్రశంసించారు.
ఈ ఆవిష్కరణ ప్రకటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారు లోహానికి మద్దతునిచ్చేందుకు దాని చుట్టూ ఉన్న ప్రధాన కారకాల కారణంగా మార్కెట్ విశ్లేషకులు బంగారంపై తమ దృక్పథాన్ని సానుకూలంగా ఉంచారు. చైనాలో బంగారం డిమాండ్ నిరంతరం పెరుగుతుండటంతో బంగారు గని గుర్తించడం చైనా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది.
బంగారు గని కనుగొన్నారు
ఈ ఆవిష్కరణ చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నమ్ముతున్నారు. చైనా బంగారు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది, దాని ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ బంగారు గనిని గుర్తించిన తర్వాత ప్రపంచంలోని ప్రధాన బంగారు గనులు దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, రష్యా, అమెరికాలో విస్తరించిన వాటిని అధిగమించింది. చైనాలోని పింగ్‌జియాంగ్ కౌంటీ బంగారు గని పటంలో ప్రముఖ స్థానాన్ని పొందడానికి సిద్ధంగా ఉంది. దీనివల్ల బంగారాన్ని ఎక్కువగా కలిగి ఉన్న దేశాలను చైనా అధిగమిస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రధాన బంగారు గనులున్న దేశాలేవి?
మైనింగ్ టెక్నాలజీ ప్రకారం , చైనీస్ బంగారు నిక్షేపం కనుగొనబడటానికి ముందు ప్రపంచంలోని అతిపెద్ద బంగారు గనులు ఇలా ఉన్నాయి:
1. సౌత్ డీప్ బంగారు గని, దక్షిణాఫ్రికా
2. గ్రాస్‌బర్గ్ బంగారు గని, ఇండోనేషియా
3. ఒలింపియాడా బంగారు గని, రష్యా
4. లిహిర్ బంగారు గని, పాపువా న్యూ గినియా
5. నార్టే అబియెర్టో బంగారు గని, చిలీ
6. కార్లిన్ ట్రెండ్ బంగారు గని, అమెరికా
7. బోడింగ్టన్ బంగారు గని, ఆస్ట్రేలియా
8. ఎంపోనెంగ్ బంగారు గని, దక్షిణాఫ్రికా
9. ప్యూబ్లో వీజో బంగారు గని, డొమినికన్ రిపబ్లిక్
10. కార్టెజ్ బంగారు గని, అమెరికా
చైనా ఈ ఆవిష్కరణ బంగారు పరిశ్రమను ఎలా మారుస్తుందో ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. పింగ్‌జియాంగ్ కౌంటీ బంగారం కొత్త రాజధాని అవుతుందా? అనేది చూడాలి.