
ప్రతి ఏడాది ఆగస్టు 20 న ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రాణాంతకమైన మలేరియా గురించి, దీనికి తీసుకోవాల్సిన నివారణా చర్యల గురించి ప్రజలకు తెలియజేసేందుకే ఈ రోజును జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మన దేశం వాటా 3 శాతంగా ఉంది. అందుకే దీని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మలేరియా ప్రోటోజోవనన్ పరాన్నజీవుల వల్ల కలిగే అంటువ్యాధి. ఈ వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమ కాటు వల్ల వ్యాపిస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారు సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలే పోవచ్చు. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.
మలేరియా లక్షణాలు
తలనొప్పి, తక్కువ రక్తపోటు, జ్వరం, ఉన్నట్టుండి శరీరం చల్లబడటం, వాంతులు, వికారం, చెమట పట్టడం, రక్తహీనత, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులుు, మూత్రపిండాల సమస్యలు, అలసట వంటిలక్షణాలు కనిపిస్తాయి.
మలేరియాను తగ్గించే ఇంటి చిట్కాలు
అల్లం
ఒక అధ్యయనం ప్రకారం.. మలేరియా బారిన పడిన వారికి అల్లం ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాంటాయి. ఇవి మలేరియా వల్ల కలిగే నొప్పి, వికారం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇందుకోసం అంగుళం అల్లం ముక్కను తీసుకుని ఒకటిన్నర కప్పు నీటిలో బాగా మరిగించండి. ఈ తర్వాత దీన్ని వడకట్టి రుచి కోసం కొద్దిగా తేనెను మిక్స్ చేసి తాగండి. దీన్ని రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పసుపు
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. పసుపులో ఉండే కర్కుమిన్ మలేరియాకు నివారణకు ఔషదంలా పనిచేస్తుంది. పసుపులో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరం నుంచి ప్లాస్మోడియం సంక్రమణ ద్వారా ఉత్పత్తి అయ్యే విషాన్ని బయటకు పంపడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మలేరియా వల్ల కలిగే కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు దీన్ని తీసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు.
సోంపు గింజలు
పబ్ మెడ్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. సోంపు గింజల్లో మలేరియా నిరోధక లక్షణాలుంటాయి. అలగే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మలేరియా ప్లాస్మోడియం సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇందుకోసం అర టీస్పూన్ సోంపు గింజలను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగండి. ప్రతిరోజూ ఉదయం భోజనానికి ముందు దీన్ని మోతాదులో తీసుకోండి.
మెంతులు
మెంతులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి మలేరియా లక్షణాలను కూడా తగ్గిస్తాయి. అందుకే మలేరియాతో బాధపడే వ్యక్తులు మెంతులను తినమని వైద్యులు సలహానిస్తుంటారు. ఇందుకోసం అర టీస్పూన్ మెంతులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని వడకట్టి ఉదయం పరిగడుపున తాగండి. వీటిని మలేరియా నయం అయ్యేంత వరకు తాగండి.
దాల్చినచెక్క
దాల్చినచెక్క కూడా మలేరియాను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది. దీనిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది మీరు త్వరగా మలేరియా నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేయండి. దీనికి చిటికెడు నల్ల మిరియాల పొడిని కూడా మిక్స్ చేసి ఫిల్టర్ చేసి తాగండి. ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగొచ్చు.