విటమిన్ డి లోపాన్ని తగ్గించుకునేందుకు శాకాహారులు తినాల్సిన బెస్ట్ ఫుడ్స్ ఇవే.. !

First Published Aug 19, 2022, 4:58 PM IST

మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఎన్నో రకాల రోగాలచ్చే ప్రమాదం ఉంది. అయితే ఇది మార్నింగ్ సూర్యరశ్మి ద్వారానే కాదు.. కొన్ని రకాల ఆహారాల ద్వారా కూడా అందుతుంది. 

 శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా.. ఎలాంటి రోగాలు సోకకుండా ఉండేందుకు పోషకాలు ఎంతో సహాయపడతాయి. అందుకే మనం తినే ఫుడ్ లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉండేలా చూసుకోవాలి. ఇకపోతే ఇతర పోషకాలతో పాటుగా మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. ఇది మన శరీరాన్ని బలంగా  ఉంచేందుకు ఎంతో సహాయపడుతుంది. ఇది ఎముకలను కూడా బలంగా ఉంచుతుంది. ఇంతేకాదు విటమిన్ డి మన నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 

కానీ ఈ రోజుల్లో  పట్టణాల్లో ఉండేవారే కాదు పల్లెల్లో ఉండే వారు కూడా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఫ్లాట్లలో నివసించేవారు, ఆఫీసుల్లో పనిచేసేవారికి సూర్యరశ్మి మొత్తమే తగలదు. దీంతో వారి శరీరంలో విటమిన్ డి లోపిస్తుంది. ఈ విటమిన్ డి సూర్యరశ్మి ద్వారానే కాదు కొన్ని రకాల ఆహారాల ద్వారా కూడా అందుతుంది. మరి ఈ విటమిన్ డి లోపం నుంచి శాకాహారులు బయటపడేందుకు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలు

 పాలను పోషకాల భాండాగారం అని కూడా అంటారు. ఎందుకంటే పాలలో కాల్షియంతో పాటుగా విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. గేదె పాల కంటే ఆవుపాలే ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తాయి. ఎందుకంటే ఆవు పాలలో విటమిన్ డి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రెగ్యులర్ గా ఒక గ్లాసు ఆవు పాలను తాగడం వల్ల విటమిన్ డి లోపం పూర్తిగా పోతుంది. 

పెరుగు

పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ డి కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. రోజూ ఒక కప్పు పెరుగును తినడం వల్ల విటమిన్ డి లోపం పోతుంది. పెరుగులో ఎముకలను బలంగా చేసే కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. పెరుగు తినడం వల్ల పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి. 

ఆరెంజ్

ఈ సిట్రస్ ఫ్రూట్ లో విటమిన్ సి కి కొదవే ఉండదు. అయితే ఈ పండులో విటమిన్ సి తో పాటుగా విటమిన్ డి కూడా పుష్కలంగానే ఉంటుంది. రోజూ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ ను తాగితే రోజుకు కావాల్సిన విటమిన్ డి అందుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 

తృణధాన్యాలు

తృణధాన్యాల్లో కూడా విటమిన్ డి పుష్కలంగానే ఉంటుంది.  విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయడానికి బార్లీ, గోధుమలు, ఇతర ధాన్యాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవచ్చు. ధాన్యాలు మీ శరీరానికి కావాల్సిన ఫైబర్ ను, ఇతర పోషకాలను అందిస్తాయి. 
 

ఓట్స్

ఓట్స్ లో ఫైబర్ యే కాదు విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తింటే విటమిన్ డి లోపం తగ్గిపోతుంది. దీన్ని కేవలం అల్పాహారంలోనే కాకుండా ఏ సమయంలోనైనా తినొచ్చు. దీనిలో ఫైబర్ ఉండటం వల్ల ఇది.. చాలా తేలికగా జీర్ణం అవుతుంది. బరువు తగ్గడానికి కూడా ఓట్స్ ఉపయోగపడతాయి.
 

పుట్టగొడుగులు

చాలా మంది శాకాహారులకు పుట్టగొడుగులను తినడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ పుట్టగొడుగుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని తింటే విటమిన్ డి లోపం నుంచి తొందరగా బయటపడతారు. పుట్టగొడుగుల్లో విటమిన్ బి1, బి2, బి5, విటమిన్ సి, మెగ్నీషియం ఉంటాయి. పుట్టగొడుగులను విటమిన్ డి కి మంచి వనరుగా భావిస్తారు.

click me!