
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ సమస్యల్లో అధిక బరువు (overweight) ఒకటి. ఇది చాలా చిన్న సమస్యగా అనిపించినప్పటికీ ఎన్నో రోగాలకు కారణముతుంది. కొన్ని కొన్ని సార్లు దీనివల్ల ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అధిక బరువు ఉన్నవారికి గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి ఎన్నో రోగాలు సోకే ప్రమాదం ఉంది.
ఇవి మాత్రమే కాదు శరీరంలో, పొట్టచుట్టూ కొవ్వు విపరీతంగా పెరిగిపోవడం వల్ల శరీర ఆకారం కూడా చెడిపోతుంది. ఇది ఆత్మవిశ్వాసం దెబ్బతినడానికి దారితీస్తుంది. అయితే బరువు తగ్గేందుకు రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతో పాటుగా బరువు తగ్గేందుకు సహాయపడే ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి పూట కొన్ని ఆహార పదార్థాలను తింటే మీరు చాలా సులువుగా బరువు తగ్గుతారు.
బరువు తగ్గేందుకు రాత్రి పూట తినాల్సిన ఆహారాలు
ఈ రోజుల్లో ఇంటి భోజనం కంటే బయట హోటల్లో లభించే ఆహారాలనే ఎక్కువగా తింటున్నారు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ , ఆయిలీ ఫుడ్ నోటికి రుచిగా అనిపించినా.. ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచివి కావు. తరచుగా వీటిని తినడం వల్ల విపరీతంగా బరువు పెరగడంతో పాటుగా ఎన్నో రకాల జబ్బులు వస్తాయి. అందుకే ఇలాంటి ఆహారాలను తినకూడదు. వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
పెరుగు (curd)
పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎన్నో రోగాలను సైతం తగ్గించగలదు. అందుకే పెరుగును ఎండాకాలంలోనే కాకుండా వానాకాలంలో కూడా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. పెరుగులో ప్రోటీన్లు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలో ఉండే ప్రోటీన్లు కండరాలను బలంగా చేస్తాయి. అలాగే పెరుగులో పుష్కలంగా ఉండే సూక్ష్మపోషకాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా బరువును తగ్గించడంలో పెరుగు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
బాదం పప్పులు (Almonds)
ప్రస్తుతం చాలా మంది లేట్ గా పడుకోవడం, ఆలస్యంగా మేల్కోవడం అలవాటు చేసుకున్నారు. అర్థరాత్రి ఎక్కువ సేపు మెలుకువగా ఉండటం వల్ల ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. దీంతో ఏది పడితే అది తింటుంటారు. దీనివల్ల బరువు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఆకలిగా అనిపించినప్పుడు కొన్ని బాదం పప్పులను తినండి. ఇవి ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. ముఖ్యంగా వీటిని తింటే మీ శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. వీటిలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
హోల్ గ్రెయిన్ బ్రెడ్ (Whole grain bread)
రాత్రిపూట ఆకలిగా అనిపించినప్పుడు మీరు ఇతర ఏ ఆహార పదార్థాలను తినకుండా హోల్ గ్రెయిన్ బ్రెడ్ తీసుకుని దానిపై వేరుశెనగ వెన్న పెట్టుకుని తినండి. ఇది బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. జీవక్రియను వేగవంతం కూడా చేస్తుంది. ఎక్కువ సేపు కడుపుని నిండుగా ఉంచుతుంది.
అరటి పండు (Banana)
అరటిపండును బరువు పెరిగేందుకే ఉపయోగించాలని భావించే వాళ్లు చాలా మందే ఉన్నారు. నిజానికి బరువును తగ్గించే ఎన్నో పోషకాలు అరటిలో ఉన్నాయి. దీనిలో ఉండే పీచు పదార్థం మీకు తొందరగా ఆకలి కాకుండా చేస్తుంది. ఇది బరువును కూడా తగ్గిస్తుంది.
వీటితో పాటుగా..
ఎక్కువగా నడవండి
నడక ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉండే వారు చిన్న చిన్న పనులకు కూడా బైక్ ల వాడకం మానుకోండి. వీలైనంత ఎక్కువ సేపు నడవండి. స్టెప్స్ ఎక్కడం వల్ల కూడా ఫ్యాట్ బర్న్ అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజుకు 30 నుంచి 40 నిమిషాల పాటు ఖచ్చితంగా నడవాలి. నడక మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
గ్రీన్ టీ (Green tea)
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా గ్రీన్ టీ తాగితే కేలరీలు చాలా ఫాస్ట్ గా తగ్గుతాయి. గ్రీన్ టీని తాగడం వల్ల శరీర ఉష్ణ్రోగ్రత తగ్గడంతో పాటుగా బరువు తగ్గే ప్రాసెస్ కూడా వేగవంతం అవుతుంది. ఇందుకోసం రోజుకు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీని తాగాలి.