చలికాలంలో గొంతునొప్పి.. తగ్గాలంటే ఇలా చేయండి..

First Published Dec 10, 2022, 2:55 PM IST

చలికాలంలో మన శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతుంది. ఈ సమయంలో గొంతు నొప్పి, జలుబు సర్వ సాధారణం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గొంతు నొప్పిని సులువుగా వదిలించుకోవచ్చు.
 

throat pain

చలికాలంలో వివిధ రకాల నొప్పులు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సీజన్ లో జలుబు, అలెర్జీలు, ముక్కు కారటం, మోకాలి నొప్పి, కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. చలికాలంలో గొంతు నొప్పి సర్వ సాధారణం. ఈ సీజన్ లో గొంతు నొప్పి, కఫం పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా నెలల కొద్దీ జలుబు, దగ్గు తగ్గనే తగ్గవు. ఈ సమస్యలను అలాగే వదిలేస్తే మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని చిట్కాలను ఉపయోగించి గొంతునొప్పిని సులువుగా తగ్గించుకోచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

వెల్లుల్లి 

చలికాలంలో ప్రతివంటలో వెల్లుల్లిని పక్కాగా వేయాలి. వెల్లుల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగున్న ఎలిసిన్ కలిగి ఉంటుంది. ఇది గొంతులో ఉన్న బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. వెల్లుల్లి శరీరంలోని వివిధ భాగాలలో కలిగే నొప్పి నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది. 

ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి

శీతాకాలంలో బ్యాక్టీరియా ముక్కు, గొంతు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో జలుబు చేస్తుంది. అలాగే గొంతు నొప్పి కలుగుతుంది. వీటికి సంబంధించిన చిన్న చిన్న లక్షణాన్ని గమనించినా.. వేడి నీటిలో ఉప్పు వేసి నోట్లో పోసి పుక్కిలించండి. ఇది బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గిస్తుంది. జలుబు తొందరగా తగ్గడానికి సహాయపడుతుంది. 
 

అల్లం టీ 

చలికాలంలో వేడిగా ఏదైనా తాగాలనే కోరిక కలగడం చాలా సహజం. అలాగే అని టీ, కాఫీలను తాగేయకూడదు. వీటిలో ఉండే కెఫిన్ కంటెంట్ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందుకే వీటికి బదులుగా అల్లంతో కలిపిన కషాయం లేదా అల్లం టీ ని తయారు చేసి తాగడం మంచిది. అల్లం శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. నొప్పిని కూడా తగ్గిస్తుంది. వీటికి తులసి ఆకులను కూడా కలిపి తాగవచ్చు.

గోరువెచ్చని నీరు

గొంతు ఇన్ఫెక్షన్ సమయంలో చల్లటి నీటిని తాగడం మంచిది కాదు. ఈ సమయంలో వేడి నీటిని తాగడం వల్ల సమస్య పెరగకుండా ఉంటుంది. నీళ్లు మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం వెచ్చగా ఉంటే చాలు. అలాగే వేడినీటి ఆవిరిని తీసుకోవడం కూడా మంచిది.
 

Throat pain

తాజా జ్యూస్

చలికాలంలో తాజా పండ్ల రసాన్ని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. పసుపు, తాజా పండ్లు, ఓట్ మీల్, అల్లం కలిపి జ్యూస్ ను తయారుచేసుకుని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇది సంక్రమణతో పోరాడటానికి మీ శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లను అందించడానికి సహాయపడుతుంది.
 

click me!