మందులు వేసుకోకుండా బీపీ తగ్గాలంటే ఈ పనులు చేయాల్సిందే..!

First Published Dec 5, 2022, 1:55 PM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, స్మోకింగ్, డ్రింకింగ్, ఒత్తిడి, ఊబకాయం వంటి కారకాలు రక్తపోటును బాగా పెంచుతాయి. రక్తపోటు బాగా పెరిగితే ప్రాణాలు కూడా పోవచ్చు. 
 

blood pressure


ఒకప్పుడు అధిక రక్తపోటు సమస్య 50 ఏండ్లు దాటిన వారిలోనే కనిపించేది. కానీ నేడు చిన్న పిల్లలు, యువత కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. అయితే రక్తపోటును కొన్ని చిట్కాలతో నియంత్రించుకోవచ్చు. కానీ చాలా మంది దీని బారిన పడ్డ విషయం తెలుసుకోలేకపోతున్నారు. దీంతో వీరి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. ఒత్తిడి, అధికంగా ఉప్పు తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం మొదలైనవి రక్తపోటును పెంచుతాయి. రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హై బీపీ నియంత్రణలో ఉంటుంది. అవేంటంటే.. 

సోడియం లేదా ఉప్పును తగ్గించాలి

రక్తపోటు ఎక్కువగా ఉన్నవాళ్లు తమ ఆహారంలో సోడియం లేదా ఉప్పు మొత్తాన్ని చాలా వరకు తగ్గించాల్సి ఉంటుంది.  ప్యాకేజీ చేసిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది.  అందుకే సాధ్యమైనంత వరకు  ఈ ఆహారాల వాడకాన్ని తగ్గించండి లేదా నివారించండి. ఇది రక్తపోటును తగ్గించడానికి,గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.
 

అధిక బరువు

ఓవర్ వెయిట్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడంతో పాటుగా గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బరువు పెరగడం వల్ల రక్తపోటు బాగా పెరుగుతుంది. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. 

Image: Getty Images

వ్యాయామం

వ్యాయామం వల్ల ఒక్కటేమిటీ ఎన్నో రోగాలు ఇట్టే తగ్గిపోతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. బాడీ ఫిట్ గా ఉంటుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. రక్తపోటు తగ్గేందుకు రోజుకు కనీసం ముప్పై నిమిషాలైనా వ్యాయామం చేయాలి. 
 

ఆహారంలో మార్పులు

కొన్ని రకాల ఆహారాలు రక్తపోటును పెంచుతాయి. అందుకే రక్తపోటును నియంత్రించడానికి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అధిక రక్తపోటును నియంత్రించడానికి మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇందుకోసం పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. 
 

స్మోకింగ్

ఈ రోజుల్లో చిన్నవయసు వారు స్మోకింగ్ చేస్తున్నారు. మీకు తెలుసా.. స్మోకింగ్ చేయడం వల్ల కూడా రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఉంది. స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. అందుకే ధూమపానాన్ని మానుకోవడం ఆరోగ్యానికి మంచిది. 

click me!