2023 లో మీకు 30 ఏండ్లు నిండాయా? మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలను తప్పక పాటించండి

First Published Jan 13, 2023, 12:55 PM IST

వయసు పెరిగే కొద్దీ గుండె జబ్బులొచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో 30 నిండిన వారు కూడా గుండెజబ్బులతో ఉన్నట్టుండి చనిపోతున్నారు. అందుకే గుండె ఆరోగ్యం కోసం ఇప్పటినుంచే కొన్ని టిప్స్ ను పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

వయసు ౩౦ దాటడం.. ఆరోగ్య రంగంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే 30 పడ్డ తర్వాత కీళ్ల నొప్పులు, ఎక్కువ అలసట, ఒంట్లో శక్తి తగ్గడం మొదలైన సమస్యలు ప్రారంభమవుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. రెగ్యులర్ ఫిట్నెస్ దినచర్యను పాటిస్తే మాత్రం ఇలాంటి సమస్యలేమీ రావంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా గుండె ఆరోగ్యం బాగుంటుంది. హృదయ సంబంధ వ్యాధులు.. ముఖ్యంగా గుండెపోటు చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ కిల్లర్ గా మారిపోయింది.  పాశ్చాత్య జనాభా కంటే.. భారతీయులకే 10 నుంచి 15 సంవత్సరాల వయస్సులోనే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని గణాంకాల ప్రకారం.. మనదేశంలో 40 సంవత్సరాల కంటే తక్కువున్న గుండెపోటు బాధితులు సుమారు 40 శాతం ఉన్నవారని అంచనా. అందుకే 30 ఏళ్ల తర్వాత గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను తప్పక పాటించాలని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

kiwi

గుండెపోటు ఎందుకు వస్తుంది ?

గుండెపోటు ఒక జీవనశైలి వ్యాధి. అనారోగ్యకరమైన జీవనశైలి  వల్లే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. అయితే శరీరంలో 50 ఏండ్ల నుంచి కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. అయితే ఈ కొవ్వు పేరుకుపోవాలా? తగ్గాలా? అనేది మన జీవనశైలి, ప్రమాద కారకాల పైన ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే గుండెపోటును నివారించడానికి చిన్న వయస్సులోనే కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

వయస్సు, లింగం, జన్యుకారకాలు, కుటుంబ చరిత్ర వల్ల కూడా గుండె జబ్బులు వస్తుంటాయి. ఇలాంటి వాటిని మార్పు చేయలేని ప్రమాద కారకాలు అంటారు. 

రక్తపోటు, డయాబెటిస్ మెల్లిటస్, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయి. వీటిని  సవరించదగిన ప్రమాద కారకాలు అంటారు. 
 


30 తర్వాత మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి చిట్కాలు

ఆరోగ్యకరమైన ఆహారం 

ఆరోగ్యకరమైన గుండె కోసం ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కూరగాయలు, పండ్లు, బీన్స్, చేపలు, తక్కువ కొవ్వు పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో తప్పకుండా తీసుకోండి. ఉప్పు, చక్కెర, ఆల్కహాల్, ఎర్ర మాంసం, పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు, వేయించిన ఆహారాలను ఎక్కువగా తీసుకోకండి. 
 

heart health

ధూమపానం తగ్గించండి లేదా పూర్తిగా మానేయండి

యువకులకు కూడా గుండెపోటు రావడానికి ప్రధాన కారణం సిగరెట్. స్మోకింగ్ రక్తపోటును, మంటను పెంచుతుంది. ఇది ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రోత్సహిస్తుంది. మీకు గమనించారో లేదో గుండె సమస్యలు ఉన్న చాలా మంది స్మోకింగ్ చేస్తుంటారు. నిజమేంటంటే.. ధూమపానం మానేసిన వెంటనే గుండె జబ్బుల ప్రమాదం తగ్గడం ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానం మానేసిన ఒక సంవత్సరం తర్వాత గుండెజబ్బుల ప్రమాదం 50 శాతానికి తగ్గుతుంది.
 

శారీరక శ్రమను పెంచండి

శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె  ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం..  వారానికి కనీసం 150 నిమిషాల పాటు చురుకైన నడక వంటి మితమైన తీవ్రత వ్యాయామాలు చేయాలి. రన్నింగ్ వంటి ఏరోబిక్ కార్యకలాపాలు 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామాలు చేయాలి. శారీరక శ్రమ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గుండెపోటు వచ్చే ప్రమాదాల్ని తగ్గిస్తాయి. 
 

heart

ఆరోగ్యకరమైన బరువు

ఆరోగ్యకరమైన బరువు, బాడీ మాస్ ఇండెక్స్ ను నిర్వహించడం గుండె జబ్బులను నివారించడానికి మంచి మార్గం. భారతీయులకు 23 కంటే తక్కువ బిఎమ్ఐ సిఫార్సు చేయబడింది. మహిళలకు 102 సెం.మీ కంటే తక్కువ నడుము చుట్టుకొలతను కలిగి ఉండాలి. అలాగే 89 సెం.మీ కంటే తక్కువ చుట్టుకొలతతో బెల్లీ ఫ్యాట్ ను తగ్గించాలని సిఫార్సు చేయబడింది.
 

నిద్ర విధానం 

నిద్రలేమి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి నిద్ర రుగ్మతలు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహానికి దారితీస్తాయి. రోజుకు 7 నుంచి 8 గంటలు నాణ్యమైన నిద్ర మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం చాలా ముఖ్యం. 
 

ఒత్తిడిని తగ్గించండి

ఒత్తిడి కార్టిసాల్, ఇతర హార్మోన్లను పెంచుతుంది. ఇది గుండెకు హానికరం. యోగా రిలాక్సేషన్ వ్యాయామాలు, ధ్యానం వంటి శారీరక కార్యకలాపాలు ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి.
 

క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి

మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి  రెగ్యులర్ గా హెల్త్ స్క్రీనింగ్ చేయించుకోండి. ఈ ప్రమాద కారకాలను ముందస్తుగా గుర్తించడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి అతి ముఖ్యమైన చిట్కాలలో ఒకటి జాగ్రత్తగా, అవగాహనతో ఉండటం.
 

చివరిగా 

ఒకసారి గుండెజబ్బులు వస్తే.. అది మిమ్మల్ని జీవితకాలం పీడిస్తూనే ఉంటుంది. కానీ దానిని నియంత్రించవచ్చు. అందుకే గుండె జబ్బులు రాకుండా నిరోధించడానికి పైన చెప్పిన మార్పులను చిన్న వయసులోనే  ప్రారంభించండి. ఎప్పుడో ఒకసారి కాదు.. మీరు బతికి ఉన్నంత వరకు ఈ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. ఈ చర్యలు అధిక రక్తపోటు, డయాబెటిస్, స్ట్రోక్, అనేక మానసిక రుగ్మతలను అభివృద్ధి చేసే అవకాశాల్ని  తగ్గిస్తాయి.

click me!