
శీతాకాలంలో మార్కెట్లో జామకాయలు నిండుగా కనిపిస్తాయి. దీనిలో పోషకాలు ఎక్కువే. అందుకే జామకాయను సూపర్ ఫుడ్ గానే చెప్పుకుంటారు. ముఖ్యంగా దీని ధర తక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల వారు దీన్ని కొనగలరు. జామకాయను అందరూ తినవచ్చని అనుకుంటారు. నిజానికి కొంతమంది జామకాయకు దూరంగా ఉండటమే మంచిది. ఎవరు జామకాయను తినవచ్చో.. ఎవరు తినకూడదో తెలుసుకోండి.
జామకాయలో మన శరీరానికి కావలసిన పోషకాలు నిండుగా ఉంటాయి. సోడియం, పొటాషియం, ప్రోటీన్, విటమిన్ సి వంటివి అధికంగా ఉంటాయి. జామకాయను తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా చాలా తగ్గుతాయి. శరీర బలహీనత కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే జామకాయలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి మనల్ని కాపాడతాయి. కాబట్టి జామకాయలు తినడం ఎంతో మంచిది. అయితే అలెర్జీలతో బాధపడే వారు మాత్రం జామ పండుకు దూరంగా ఉండాలి. జామకాయ తిన్న వెంటనే దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై వాపు వంటివి కనిపిస్తే మీకు జామకాయ పడడం లేదని అర్థం. అలాంటి వారు తినడం ఏ మాత్రం మంచిది కాదు. చర్మంపై ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించండి. జామకాయను తినకండి.
జామకాయ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం, విరేచనాలు కావడం, గ్యాస్ట్రిక్ సమస్య మొదలవడం, గుండెల్లో మంట, జీర్ణం కాకపోవడం వంటివి కనిపిస్తే మీకు జామకాయ పడడం లేదని అర్థం. జామకాయలో ఉండే విటమిన్ సి, ఫ్రక్టోజ్ వంటివి జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. అలాగే జామ గింజలు కూడా జీర్ణ వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు కనిపించినా కూడా జామకాయకి దూరంగా ఉండాలి. అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు, గొంతు నొప్పితో బాధపడుతున్న వారు కూడా జామకాయలు తినకపోవడమే మంచిది. ఎందుకంటే దీనికి శరీరాన్ని చల్లబరిచే స్వభావం ఉంటుంది.
జామ పండు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతో మంచిది. అయితే రక్తంలో చక్కర స్థాయిలు తక్కువగా ఉండడం కూడా సమస్యే. ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటే దాన్ని హైపోగ్లైసిమియా అని అంటారు. అలాంటి సమస్యతో బాధపడుతున్న వారు కూడా జామకాయకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
శరీరానికి ఎక్కడో దగ్గర ఆపరేషన్ జరిగినా కూడా మీరు జామపండు తినడం ఏమాత్రం మంచిది కాదు. ఇది రక్తస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే గాయం త్వరగా తగ్గకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా మందులు వాడుతున్న వారు జామకాయకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పైన చెప్పిన సమస్యలు ఉన్నవారు కాకుండా మిగతావారు ఎవరైనా కూడా జామకాయను హ్యాపీగా తినవచ్చు. ఇది అన్ని రకాలుగా మేలే చేస్తుంది.