మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మందు బాబులు మాత్రం ఆల్కహాల్ అలవాటును మానడానికి ఇష్టపడరు. ఇక ఆల్కహాల్‌కు సంబంధించి ఎన్నో అపోహలు ఉన్నాయి. అలాంటి కొన్ని అపోహల గురించి, వాటిలో ఉన్న నిజా నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆల్కహాల్‌ను కొద్ది మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కొందరు అభిప్రాయపడుతుంటారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ కొద్ది మొత్తంలో తీసుకున్నా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. అయితే రెండ్ వైన్ వంటి పానీయాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కొద్దిగా మెరుగైన ఫలితాలు చూపాయని పలు పరిశోధనల్లో వెల్లడైనా.. మొత్తం మీద ఆల్కహాల్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది అంటున్నారు.
మద్యం శరీరంలో డిటాక్సిఫైయింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుందని కూడా కొందరు నమ్ముతుంటారు. అయితే ఆల్కహాల్ శరీరంలో టాక్సిన్స్‌ను తగ్గిస్తుందనడంలో నిజం ఉన్నప్పటికీ లివర్‌పై ఒత్తిడి పెంచి కాలేయ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇక అలసట లేదా డిప్రెషన్‌తో బాధపడేవారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని కొందరు విశ్వసిస్తుంటారు. అయితే ఆల్కహాల్ నరాల వ్యవస్థను నిశ్చలంగా చేస్తుందనడంలో నిజం ఉన్నా ఇది మానసిక సమస్యలను మరింత తీవ్రతరం చేసే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేయడం నేరమని తెలిసిందే. అయితే తక్కువ మొత్తంలో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేస్తే ఎలాంటి సమస్య రాదని కొందరు నమ్ముతారు. అయితే చిన్న మొత్తంలోనైనా ఆల్కహాల్ నరాలపై ప్రభావం చూపి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఆల్కహాల్ సేవించి వాహనం నడపడం అస్సలు మంచిది కాదని అంటున్నారు. ఆల్కహాల్ శక్తిని పెంచుతుందనే భావనలో కూడా కొందరు ఉంటారు. అయితే ఆల్కహాల్ తాత్కాలిక శక్తిని పెంచినట్లు అనిపించినా.. దీర్ఘకాలికంగా శక్తిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చాలా మందిలో ఉండే అపోహల్లో మద్యం సేవిస్తే మంచి నిద్ర వస్తుందని భావిస్తారు. అయితే ఆల్కహాల్ తీసుకున్న వెంటనే మంచి నిద్రకు ప్రేరేపించినా నిద్ర నాణ్యత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడంతో నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి ఆల్కహాల్ సేవించడం వల్ల నిద్ర వచ్చిన భావన కలుగుతుందన్నదాంట్లో ఎంత నిజం ఉందో రాత్రంతా నిద్ర డిస్ట్రబ్ అవుతుందన్న దాంట్లో కూడా అంతే నిజం ఉందని నిపుణులు చెబుతున్నారు.