క్యాన్సర్ తో మరణిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. అందుకే ఇప్పుడు క్యాన్సర్ కు టీకాను కనిపెట్టే పనిలో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు బిజీ అయిపోయారు. రష్యా ఒక అడుగు ముందుకు వేసి హ్యూమన్ ట్రయల్స్ వరకు చేరుకుంది.
మనిషి మేధస్సుకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడైంది. ఈ రెండింటి కలయిక వల్ల క్యాన్సర్ టీకా కనిపెట్టే పని చురుకుగా సాగుతోంది. వైద్య రంగంలో సరికొత్త సంచలనాన్ని సృష్టించేందుకు క్యాన్సర్ టీకా సిద్దమవుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రష్యా ఏఐ సాయంతో క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టుగా గతేడాది ప్రకటించింది. ఇప్పుడు అది హ్యూమన్ ట్రయల్స్ వరకు చేరుకుంది. ఈ హ్యూమన్ ట్రయల్స్ లో క్యాన్సర్ కణాలను ఈ వ్యాక్సిన్ అణిచివేయగలిగితే ఎంతోమంది క్యాన్సర్ రోగులకు పునర్జన్మను ప్రసాదించినట్టే. ప్రపంచ ఆరోగ్య రంగంలో ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి.
25
క్యాన్సర్ చికిత్సకు అద్భుతమైన టీకా
మనిషి శరీరంలోని ప్రతి అవయవాన్ని టార్గెట్ చేసే విధంగా క్యాన్సర్ తనను తాను అభివృద్ధి చేసుకుంటోంది. క్యాన్సర్ కణాలు శరీరంలో చేరాయంటే వాటిని పూర్తిగా తొలగించడం ఇప్పటి వైద్య సామర్థ్యం వల్ల కావడం లేదు. కీమోథెరపీ, రేడియో థెరపీ, శస్త్ర చికిత్సలు చేస్తున్నప్పటికీ కొంతమందిలో అవి తాత్కాలికంగానే తొలగిపోతున్నాయి. రెండు మూడేళ్లు లేదా ఐదేళ్ల తర్వాత తిరిగి క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కావడం మొదలవుతున్నాయి. అందుకే క్యాన్సర్ ను పూర్తిగా అరికట్టే విధంగా టీకాను అభివృద్ధి చేసే పనిలో ఎంతోమంది శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. రష్యా శాస్త్రవేత్తలు ఈ విషయంలో ముందడుగు వేశారు.
35
ఏఐతో కలిసి టీకా తయారీ
ఏఐ సాంకేతికతతో మాస్కోలోని ప్రముఖ ఆంకాలజీ రీసెర్చర్లు mRna అనే క్యాన్సర్ టీకాను తయారు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెల మధ్యలో ఈ వ్యాక్సిన్ మనుషులపై తొలిసారి ప్రయోగించబోతున్నారు. ఈ హ్యూమన్ ట్రయల్స్ లో క్యాన్సర్ కణాలను ఈ టీకా ఎంతవరకు అడ్డుకోగలుగుతుందో అంచనా వేస్తారు. ఇప్పటికే కొన్ని జంతువులపై ఈ క్యాన్సర్ టీకాను ప్రయోగించి చూశారు. అవి క్యాన్సర్ కణితులను 80 శాతం వరకు అడ్డుకున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ పై ఈ టీకా పని చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.
45
హ్యుమన్ ట్రయల్స్ మొదలు
హ్యూమన్ ట్రయల్స్ సక్సెస్ అయితే అత్యంత త్వరగా ఈ వ్యాక్సిన్ ను తమ పౌరులకు దీన్ని అందించనున్నారు రష్యా శాస్త్రవేత్తలు. అది కూడా ఉచితంగా అందించనున్నారు. రష్యాలో దాదాపు 40 లక్షల మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అంతేకాదు అక్కడ ఆరు లక్షల 25 వేల కొత్త కేసులు కూడా నమోదు అవుతున్నాయి. అందుకే రష్యా క్యాన్సర్ టీకాను తయారు చేసే పనిలో పడ్డారు. వ్యాక్సిన్ సక్సెస్ అయితే కేవలం ఆ దేశ ప్రజలకే కాదు ప్రపంచంలోని ఎంతో మంది క్యాన్సర్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే రష్యా ఇది ఇతర దేశాలకు ఉచితంగా ఇచ్చే అవకాశం లేదు.. కచ్చితంగా దీనిని అమ్ముతుంది. ఖరీదు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
55
మనదేశంలో క్యాన్సర్ రోగుల పరిస్థితి
భారతదేశంలో కూడా క్యాన్సర్ కేసులో ప్రతి ఏడాది అధికంగానే నమోదు అవుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతున్న ప్రకారం ప్రతి లక్ష మందిలో వందమందికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. 2023లో ఏకంగా 14 లక్షల పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదయినట్టు అంచనా వేశారు. గ్లోబొకాన్ అంచనా ప్రకారం 2020 నుండి 2040 మధ్యలో మన దేశంలో క్యాన్సర్ కేసులు 57.5 శాతం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ కాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ మన దేశంలో అధికంగా కనిపిస్తున్నాయి. రష్యా తయారు చేసే వ్యాక్సిన్ వల్ల మన దేశ రోగులకు కూడా ఎంతో ఉపశమనం లభిస్తుంది.