
నిజానికి వైట్ రైస్ కంటే గోధుమ చపాతీలు, జొన్ రొట్టెలే ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ప్రస్తుత కాలంలో చాలా మంది చపాతీలు, రొట్టెలనే ఎక్కువగా తింటున్నారు. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా రాత్రి భోజనంలో ఎక్కువగా తింటుంటారు.
కొంతమంది వీటిని అలవాటుగా తింటే మరికొంతమంది బరువు పెరగకూడదన్న ఉద్దేశంతో బలవంతంగా తింటుంటారు. అయితే ఇప్పటికీ రాత్రిమిగిలిన వాటిని ఉదయం, ఉదయం మిగిలిన చపాతీలను రాత్రిళ్లు తింటుంటారు. అసలు ఇలా తినడం మంచిదేనా?
నిజానికి రాత్రిమిగిలిన చపాతీలను కానీ, రొట్టెలను గానీ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మంది అంటుంటారు. మరికొంతమంది అస్సలు మంచిది కాదంటుంటారు. అసలు రాత్రిమిగిలిన రొట్టెలను తినడం వల్ల కలిగే ప్రయజనాలు, నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రాత్రిమిగిలిపోయిన చపాతీలను, రొట్టెలను ఉదయం తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రి మిగిలిన రొట్టెలను అలాగే తినాలి. కానీ నూనె లేదా వెన్నతో మళ్లీ వేడి చేసి లేదా కాల్చి తింటే అందులో ఉండే ప్రీబయోటిక్స్ నశిస్తాయి. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
షుగర్ ను నియంత్రిస్తుంది
డయాబెటీస్ పేషెంట్లకు రాత్రి మిగిలిన చపాతీలు చాలా మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే గనుక మీరు రాత్రిమిగిలిన చపాతీలను ఖచ్చితంగా తినండి. నిజానికి డయాబెటీస్ పేషెంట్లకు ఇవి మంచి బ్రేక్ ఫాస్ట్. ఎందుకంటే ఇవి బ్లడ్ షుగర్ ను నియంత్రణలో ఉంచుతాయి.
ఉదర సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా రాత్రి మిగిలిన చపాతీలు చాలా మంచివి. వీటిని తింటే మలబద్దకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ చపాతీలో జీర్ణ ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే తిన్నది సులువుగా జీర్ణం అవుతుంది. అలాగే దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని మలబద్దకం సమస్య నుంచి బయటపడేస్తుంది.
బరువు తగ్గుతారు
ఫాస్ట్ గా బరువు తగ్గాలనుకునేవారికి మిగిలిపోయిన చపాతీ, రొట్టె మంచి ఫుడ్ అనే చెప్పాలి. నిజానికి రాత్రిచేసిన చపాతీలో పిండి పదార్థాలు తగ్గుతాయి. అలాగే దీనిలో కేలరీల కంటెంట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక గొప్ప మార్గమనే చెప్పాలి.
రాత్రిచేసిన చపాతీల్లో మన కండరాలను బలంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మీరు వీటిని ఉదయాన్నే పాలలో కలుపుకుని తినొచ్చు. వర్కౌట్స్ చేసేవారు దీనిని డైట్ లో చేర్చుకోడం మంచిది.
ఎక్కువ సేపు నిల్వ ఉండటం వల్ల చపాతీల రుచి అంతగా బాగుండదు. అలాగే కొన్ని కొన్ని సార్లు ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల వాంతులు, జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే ఎక్కువ రోజులు నిల్వ ఉన్న చపాతీలను తినడం మంచిది కాదు.