నవ్వుతూ బతకాలని పెద్దలు చెబుతారు. అందుకే చాలామంది ఎన్ని కష్టాల్లో ఉన్నా మొహంపై చిరునవ్వును మాత్రం చెదరనివ్వరు. కానీ దీనివల్ల భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మానసిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనసులో ఎంత బాధ ఉన్నా ఇతరులకు కనిపించకుండా ఉండాలని చాలామంది నవ్వుతూ మాట్లాడుతారు. ఇలా మాట్లాడేవారు స్మైలింగ్ డిప్రెషన్ లో ఉన్నారని అర్థం. ఇలాంటివారు నలుగురిలో నవ్వుతూ కనిపిస్తున్నా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం చాలా నిరాశగా ఉంటారు.
స్మైలింగ్ డిప్రెషన్‌తో బాధపడేవారు ఏ పని మీద దృష్టి పెట్టలేరు. సొంతంగా ఏ నిర్ణయాన్ని తీసుకోలేరు. ఎక్కువ అలిసిపోతారు. సరిగ్గా నిద్రపోలేరు. వీరికి ఆకలి కూడా తగ్గిపోతుంది. ఒకసారిగా బరువు తగ్గిపోవడం లేదా పెరగడం జరుగుతుంది. కానీ వారి ఇబ్బందులను ఎవరు తెలుసుకోకూడదని ఇప్పుడూ నవ్వుతూనే మాట్లాడతారు.
సమస్య నుంచి బయట పడాలంటే..
స్మైలింగ్ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ప్రతికూల ఆలోచనలు తగ్గించుకోవాలి. మానసిక వైద్యుల సూచనలు పాటిస్తూ, వారు ఇచ్చిన మందులు రెగ్యులర్ గా వాడాలి. మందులతో పాటు ప్రతిరోజు వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజు 7 నుంచి 9 గంటలపాటు కచ్చితంగా నిద్రపోవాలి.
నవ్వుతూ బాధను కవర్ చేసుకోవడం కంటే బెస్ట్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో పంచుకుంటే భారం తగ్గుతుంది. తద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.