శనగ పిండి చర్మ ఆరోగ్యానికి ఎంతమంచిదో అందరికీ తెలుసు. ఈ పిండిలో కొన్ని పదార్థాలు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా చాలా రకాల చర్మ సమస్యలను దూరం చేసుకోవడంతో పాటు ముఖం అందాన్ని పెంచుకోవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.
శనగ పిండిని ఎలా ఉపయోగించాలి?
శనగ పిండి సాయంతో ముఖంపై మొటిమలు, మచ్చలను సులభంగా తొలగించవచ్చు. అంతేకాదు ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. శనగపిండిని ఉపయోగించి ముఖాన్ని ఎలా అందంగా మార్చుకోవాలో ఇక్కడ చూద్దాం.
శనగపిండి, నిమ్మరసం
2 స్పూన్ల శనగపిండిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖమంతా పట్టించి 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ముఖంలోని నల్ల మచ్చలు, నలుపును తగ్గించడంలో సహాయపడుతాయి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.
శనగపిండి, పెరుగు
2 లేదా 3 స్పూన్ల శనగపిండితో 2 స్పూన్ల పెరుగు కలిపి ఆ పేస్ట్‌ను ముఖమంతా పట్టించి బాగా ఆరిన తర్వాత ముఖాన్ని నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంలోని మొటిమలు, నల్ల మచ్చలు, మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేసుకోవచ్చు.
శనగపిండి, రోజ్ వాటర్
ఒక స్పూన్ శనగపిండితో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని ప్రకాశవంతంగా, అందంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది ముఖాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది. ఈ ఫేస్ ప్యాక్ అన్ని స్కిన్ టోన్లకు సరిపోతుంది. ఇది ముఖ్యంగా పొడి చర్మానికి బాగా పనిచేస్తుంది.
శనగపిండి, పచ్చిపాలు
2 స్పూన్ల శనగపిండిలో 3-5 స్పూన్ల పచ్చిపాలు కలిపి ముఖం, మెడకు పట్టించి బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. పచ్చిపాలు చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని సులభంగా తొలగిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ముఖాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను మీరు వారానికి 1-2 సార్లు వేసుకోవచ్చు.