
ఫోన్ ఉందంటే.. అరచేతిలో ప్రపంచం వచ్చినట్టే. ఒక చిన్న ఫోన్ తో ప్రపంచం నలుమూలల జరిగే విషయాలను క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. నిజానికి ఫోన్ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ రోజుల్లో ఫోన్ల వాడకం బాగా పెరిగింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్లకు బాగా అలవాటు పడిపోయారు. కానీ ఫోన్ ను లిమిట్ కు మించి వాడితేనే అసలు సమస్య.
దీనివల్ల మనం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫోన్ ను అనవసర పనులకోసం ఉపయోగించడం వల్ల మన టైం వేస్ట్ కావడమే కాదు.. ఇది మన ఆలోచల్ని చెడు వైపు తీసుకెళ్తుంది. అలాగే మానసిక, శారీరక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది అయితే క్షణం కూడా ఫోన్ లేకుండా ఉండలేక పోతుంటారు. అసలు ఎప్పుడూ ఫోన్ ను చూడటం వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కళ్ల సమస్యలు
మొబైల్ ఫోన్ ను ఎప్పుడూ చూడటం వల్ల వచ్చే ప్రధాన సమస్యల్లో కంటి సమస్యలు ముందుంటాయి. ఎందుకంటే ఎప్పుడూ ఫోన్ ను చూడటం వల్ల కళ్లపై బాగా ఒత్తిడి పడుతుంది. అలాగే తలనొప్పి, కంఫర్ట్ లేకపోవడం, కళ్లు పొడిబారడం, చూపు మందగించడం, మసక మసకగా కనిపించడం వంటి సమస్యలు వస్తాయి.
అంతేకాదు ఎప్పుడూ ఫోన్ ను చూడటం వల్ల మనం రెప్పవాల్చే ఫ్రీక్వెన్సీ కూడా బాగా తగ్గుతుంది. దీంతో కళ్లలో తేమ తగ్గి పొడిబారుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫోన్ లో అక్షరాలు చాలా చిన్నగా ఉంటాయి. దీనిపై ఫోకస్ ఎక్కువ చేయడం వల్ల మన కంటి కండరాలపై ఒత్తిడి బాగా పడుతుంది. దీనివల్ల మీరు ఎన్నో కంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెడ, చేతి నొప్పి ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా దీనివల్ల మస్క్యులోస్కెలెటల్ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే మనం ఫోన్ ను చూసేటప్పుడు తల ముందుకు వంచే ఉంచుతాం. దీనివల్ల ఈ సమస్య వస్తుంది. అలాగే టైపింగ్, స్వైపింగ్ వల్ల చేతులు, భుజాలు, మెడకు సంబంధించిన దీర్ఘకాలిక నొప్పి కలుగుతుందని ఆరోగ్య నిపుణఉలు చెబుతున్నారు.
ఎప్పుడూ ఫోన్ మాట్లాడటం లేదా పాటలు వినడం, రీల్స్ అంటూ ఏదో ఒకటి ఫోన్ లో వినడం వల్ల వినికిడి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ ను చాలా కాలం పాటు వింటూ ఉంటే మీ చెవులు వినపడకపోవచ్చు. ఎప్పుడూ ఎక్కువ సౌండ్ ను వినడం వల్ల కర్ణబేరి దెబ్బతిని చెవిటివారు అవుతారు.
మొబైల్ ఫోన్లను ఎక్కువగా వాడేవారికి నిద్ర సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఫోన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల మన నిద్ర చక్రానికి ఆటంకం కలుగుతుంది. అంటే దీనివల్ల నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్తుతుంది. దీంతో మీకు నిద్రలేమి సమస్యతో పాటుగా ఇతర సమస్యలు కూడా వస్తాయి. దీనివల్ల మీ మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే పడుకోవడానికి గంట ముందే ఫోన్ ను పక్కన పెట్టాలి.
కండరాల సమస్యలు
మొబైల్ ఫోన్ ను ఎక్కువగా చూడటం వల్ల కండరాల సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ ఫోన్ ను చూడటం వల్ల కండరాలు, ఎముకల్లో బాగా నొప్పి కలుగుతుంది.
మొబైల్ ఫోన్ ను ఎక్కువగా వాడటం వల్ల శారీరక సమస్యలు మాత్రమే కాదు మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. మొబైల్ ను ఎక్కువగా వాడేవారు దీనికి బానిసలు అవుతారు. అలాగే ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యల బారిన పడతారు. ఇవి ఆరోగ్యానికి చాలా డేంజర్. అందుకే మొబైల్ ఫోన్లను అవసరానికి మించి వాడకూడదు.