Shoe Cleaning Tips: మనం రోజూ వాడే షూస్ మురికిగా మారడం సహజం. కొందరు వీటిని చేతులతో శుభ్రం చేస్తే, మరికొందరు వాషింగ్ మెషిన్ లో వేయాలనుకుంటారు. అయితే అన్ని రకాల షూస్‌ను మెషీన్‌లో వాష్ చేయవచ్చా? చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
రోజువారీ వాడకంలో షూస్‌పై దుమ్ము, దూళి, చెమట, మురికి చేరడం సహజం. వీటిని శుభ్రం చేయడానికి చాలా మంది వాషింగ్ మెషీన్‌ను వాడుతుంటారు. కానీ, అన్ని రకాల షూస్‌ను మెషీన్‌లో ఉతకకూడదు. కాన్వాస్, కాటన్, నైలాన్, పాలిస్టర్, మెష్‌తో చేసిన కొన్ని షూస్‌ను మాత్రమే మెషిన్ లో ఉతకాలి. అలాగే లెదర్, స్వెడ్ తో తయారు చేసిన షూస్‌ను మెషీన్‌లో అస్సలు వేయకూడదు. ఉతికే ముందు షూ ముందు భాగంలో ఉన్న కేర్ లేబుల్ సూచనలను తప్పక చదవాలి.
25
ముందు ఏం చేయాలంటే?
షూస్‌ను మెషీన్‌లో వేసే ముందు వాటి లేస్‌లను, సులభంగా తీయగలిగే ఇన్‌సోల్స్ (లోపలి ప్యాడ్‌లు)ను విడిగా తీసేయాలి. ఆ తర్వాత ఒక సాఫ్ట్ బ్రష్ లేదా పాత టూత్‌బ్రష్ వాడి షూస్‌పై ఉన్న పొడి మట్టిని, దుమ్మును తొలగించాలి. ముఖ్యంగా అడుగు భాగంలో ఉండే గుంటల్లో ఇరుక్కున్న మురికిని బాగా శుభ్రం చేయాలి. మొండి మరకలు ఉంటే, ఆ మెటీరియల్‌కు సరిపోయే స్టెయిన్ రిమూవర్‌ను వాడొచ్చు. ఆ తర్వాత షూస్‌ను ఒక మెష్ బ్యాగ్‌లో (వల లాంటి సంచి) లేదా పాత దిండు కవర్‌లో పెట్టి ఉతకడం సురక్షితం.
35
వాషింగ్ మెషీన్ సెట్టింగ్స్
షూస్ ఉతికేటప్పుడు జెంటిల్ సైకిల్ (సాఫ్ట్ వాష్) ఎంచుకోవడం చాలా ముఖ్యం. చల్లటి నీటిని వాడటం వల్ల రంగు వెలిసిపోవడం, క్లాత్ ముడతలు పడటం, గమ్ ఊడిపోవడం లాంటి సమస్యలను తగ్గించవచ్చు. ఎక్కువ డిటర్జెంట్ వాడొద్దు. కొద్దిగా మైల్డ్ లిక్విడ్ డిటర్జెంట్ వేస్తే సరిపోతుంది. మెషీన్ తిరుగుతున్నప్పుడు షూస్ గోడలకు తగిలి శబ్దం రాకుండా ఉండటానికి కొన్ని పాత టవల్స్ కూడా వేయడం మంచిది. బ్లీచ్ లాంటి కఠినమైన రసాయనాలను అస్సలు వాడకూడదు.
షూ లేస్‌లను విడిగా ఒక మెష్ బ్యాగ్‌లో పెట్టి మెషీన్‌లో ఉతకవచ్చు. లేదా కొద్దిగా సబ్బు కలిపిన గోరువెచ్చని నీటిలో నానబెట్టి మెల్లగా రుద్ది శుభ్రం చేయవచ్చు. ఇన్‌సోల్స్‌ను సాఫ్ట్ క్లాత్, మైల్డ్ సోప్ వాడి చేత్తో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. వీటిని మళ్లీ షూస్‌లో వేసే ముందు పూర్తిగా ఆరిపోయాయో లేదో చూసుకోవాలి.
55
ఈ తప్పు చేయొద్దు..
వాషింగ్ సైకిల్ పూర్తవ్వగానే షూస్‌ను వెంటనే బయటకు తీసేయాలి. వాటిని డైరెక్ట్‌గా డ్రయ్యర్‌లో వేయకూడదు. అధిక వేడి వల్ల షూస్ గమ్ పాడైపోయి, వాటి ఆకారం కూడా మారిపోయే ప్రమాదం ఉంది. ఒక శుభ్రమైన టవల్‌తో మెల్లగా అద్ది అదనపు నీటిని తీసేయాలి. ఆ తర్వాత లోపల పేపర్ టవల్స్ లేదా పొడి గుడ్డను పెట్టాలి. తర్వాత నేరుగా ఎండ పడని, గాలి బాగా ఆడే చోట మాత్రమే ఆరబెట్టాలి.