Silver Jewellery: వెండి నగలు చూడటానికి అందంగా ఉంటాయి. అందుకే చాలామంది వెండి గాజులు, పట్టీలు, రింగులు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అయితే కొంతకాలం తర్వాత వెండి నగలు నల్లగా మారిపోతుంటాయి. పాతవాటిలా కనిపిస్తాయి. అసలు అవి ఎందుకు నల్లబడుతాయో తెలుసుకుందాం.
వెండి నగలు పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా వెండి పట్టీలు, గాజులు, గొలుసులు, ఉంగరాలు, చెవి కమ్మలు వంటి ఆభరణాలు అందాన్ని మరింత పెంచుతాయి. అయితే కొంతకాలం తర్వాత వెండి నగలు నల్లగా మారిపోతుంటాయి. దీంతో చాలామంది వాటిని పెట్టుకోవడానికి ఇష్టపడరు. మరికొందరు వెండి నాణ్యత బాగోలేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని అనుకుంటారు. కానీ నిజంగా వెండి నగలు నల్లగా ఎందుకు మారుతాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
వెండి నగలు నల్లగా మారడానికి కారణం
వెండి నగలు నల్లగా మారడానికి ప్రధాన కారణం గాలిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలతో వెండి ప్రతిచర్య చెందడం. ఈ రసాయన చర్య వల్ల వెండి పై భాగంపై సిల్వర్ సల్ఫైడ్ అనే నల్లటి పొర ఏర్పడుతుంది. మొదట్లో వెండి నగలు కొద్దిగా మెరుపు కోల్పోయినట్లు కనిపిస్తాయి. ఆ తర్వాత క్రమంగా నల్లటి మరకలు ఏర్పడతాయి. ముఖ్యంగా గాలిలోని హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు దీనికి కారణమవుతాయి. అందుకే వెండి నగలను ఎంత జాగ్రత్తగా ఉంచినా కొంతకాలానికి వాటి రంగులో మార్పు కనిపిస్తుంది.
36
చెమట వల్ల వెండి నగలు నల్లగా మారుతాయా?
చెమట కూడా వెండి నగలపై ప్రభావం చూపుతుంది. చెమటలో ఉండే లవణాలు, తేమ, ఇతర పదార్థాలు వెండి ఉపరితలంతో కలిసి దాని మెరుపును తగ్గించవచ్చు. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా చెమట పట్టేవారు వెండి గొలుసులు, ఉంగరాలు, గాజులు పెట్టుకున్నప్పుడు అవి త్వరగా నల్లబడే అవకాశం ఉంటుంది.
బ్యూటీ ప్రోడక్ట్స్ ప్రభావం
చాలామంది రెడీ అయ్యేటప్పుడు ముందుగా పెర్ఫ్యూమ్, బాడీ లోషన్, మాయిశ్చరైజర్, హెయిర్ స్ప్రే వంటి వాటిని ఉపయోగిస్తారు. ఆ తర్వాత నగలు వేసుకుంటారు. అయితే వీటిలో ఉండే కొన్ని రసాయనాలు వెండి నగల ఉపరితలంతో ప్రతిచర్య చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా పెర్ఫ్యూమ్, హెయిర్ స్ప్రే నేరుగా నగలపై పడితే వాటి మెరుపు తగ్గవచ్చు.
వెండి నగలు నల్లగా మారడానికి తేమ కూడా కారణం. ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో వెండి ఆభరణాలు త్వరగా మెరుపు కోల్పోయే అవకాశం ఉంది. బాత్రూమ్‌లు, కిచెన్‌లు వంటి తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నగలను ఉంచడం మంచిది కాదు. అలాగే నగలను తడి చేతులతో తీసి నేరుగా జ్యువెలరీ బాక్స్‌లో పెట్టడం వల్ల కూడా సమస్య రావచ్చు.
56
వెండి నగల నాణ్యత కూడా కారణమా?
వెండి నగల నాణ్యత, వాటి తయారీ విధానం కూడా నల్లబడే వేగాన్ని ప్రభావితం చేస్తాయి. నిపుణుల ప్రకారం స్వచ్ఛమైన వెండి కూడా సల్ఫర్‌తో ప్రతిచర్య చెంది నల్లబడుతుంది. కాబట్టి వెండి నగలు నల్లగా మారితే, అవి నకిలీవని వెంటనే నిర్థారించకూడదు.
66
వెండి నగల మెరుపు కోసం..
సాధారణంగా వెండి నగలపై ఏర్పడిన నల్లటి పొరను తొలగించేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన సిల్వర్ పాలిషింగ్ క్లాత్ ఉపయోగించవచ్చు. దీనితో నగలను సున్నితంగా తుడిస్తే మెరుపు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ మురికి ఉంటే కొద్దిగా మైల్డ్ లిక్విడ్ సోప్ కలిపిన నీటితో శుభ్రం చేసి, ఆ తర్వాత పూర్తిగా ఆరబెట్టాలి. వెండి నగలు ఎక్కువ కాలం మెరుస్తూ ఉండాలంటే వాటిని ఉపయోగించిన తర్వాత మెత్తటి పొడి గుడ్డతో తుడిచి భద్రపరచాలి. వీలైతే ఒక్కో నగను విడివిడిగా గాలి చొరబడని పౌచ్‌లలో ఉంచాలి.