భార్యా భర్తల బంధంలో ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన ముఖ్యం. కానీ కొందరు భర్తలు మాత్రం తమ భార్యలను అన్నీ విషయాల్లో తక్కువ చేసి చూస్తుంటారు. వారికి ఏమి తెలియదు అన్నట్లు తీసిపారేస్తారు. అలాంటి భర్తల గురించి సైకాలజీ ఏం చెప్తోందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా కొంతమంది భర్తలు.. ప్రతీ విషయంలో భార్యను తక్కువచేసి చూస్తుంటారు. అయితే దీని వెనుక కొన్ని లోతైన మానసిక కారణాలు ఉన్నాయని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. భార్యను తక్కువ చేసి చూసేవారిలో ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందట. తన సామర్థ్యం, స్థానం మీద మనసులో అనుమానం ఉన్నప్పుడు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి భార్యను విమర్శించడం, ఆమెను చిన్నచూపు చూడడం, తద్వారా తానే గొప్పవాడినని నిరూపించుకోవడం వంటివి చేస్తారట.
25
బాల్యంలోని అనుభవాలు
చిన్నతనంలో చూసిన కుటుంబ నమూనాలు, కొన్ని అనుభవాలు కూడా వ్యక్తులను ప్రభావితం చేస్తాయని సైకాలజీ స్పష్టం చేస్తోంది. తండ్రి.. తల్లిని అవమానించే వాతావరణంలో పెరిగిన వ్యక్తికి అది మెదడులో నిలిచిపోయి ఉంటుంది. అలాంటి వారు తండ్రి ప్రవర్తనను ప్రశ్నించకపోగా.. పెద్దయ్యాక తన భార్యతో కూడా అలాగే ప్రవర్తించాలి అనుకుంటారు.
35
భార్యపై నియంత్రణ
కొందరు భర్తలు.. భార్యను స్వతంత్రంగా ఆలోచించనీయకుండా, ఆమె నిర్ణయాలను చిన్నచూపు చూడటం ద్వారా తనను కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. సైకాలజీ ప్రకారం ఇలాంటి ప్రవర్తన వెనుక ఒక రకమైన భయం ఉంటుంది. భార్య ఎదుగుతుందేమో, తనకంటే ముందుకు పోతుందేమో అనే భయం వల్ల కొందరు భర్తలు.. భార్య విజయాలను మెచ్చుకోకపోవడం, చిన్న తప్పులను పెద్దగా చేసి చూపించడం వంటివి చేస్తుంటారు.
ఆత్మగౌరవం తక్కువగా ఉన్న వ్యక్తులు కూడా ఇతరులను కించపరిచే అవకాశముందని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. తన విలువను తాను గుర్తించలేని భర్త, భార్యను తక్కువచేసి చూడడం ద్వారా నేనే గొప్ప అనే భావనను పొందుతాడు. దానివల్ల భార్య ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. సంబంధంలో దూరం పెరుగుతుంది.
55
పురుషుల పెత్తనం
కొన్ని కుటుంబాల్లో పురుషుల పెత్తనం కొనసాగుతుంటుంది. భర్త చెప్పిందే భార్య వినాలి అనే భావనతో పెరిగిన వ్యక్తి, సమానత్వాన్ని అంగీకరించడానికి ఇబ్బంది పడతాడు. అయితే ఇలాంటి మనస్తత్వం మారదా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం వీరిలో మార్పు సాధ్యమే. కానీ భార్యను తక్కువచేసి చూడడం సాధారణం విషయం కాదని, అది వారి సంబంధానికి మంచిది కాదని భర్త అంగీకరించాలి. అర్థం చేసుకోవాలి. నిజానికి భార్యను చిన్నచూపు చూసే భర్త మనస్తత్వం వెనుక గర్వం కంటే భయం, బలహీనతే ఎక్కువగా ఉంటాయి. వాటిని మార్చుకుంటే భార్యా భర్తల బంధం సంతోషంగా ముందుకు సాగుతుంది.