పెసరపప్పుతో చేసిన హల్వా (Pesarapappu Halwa) చాలా రుచిగా ఉంటుంది. దీన్ని దేవతలకు నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. పెసరపప్పు హల్వాను చాలా సింపుల్ గా ఎలా చేయాలో తెలుసుకోండి.
పండగల సమయంలో స్వీట్ రెసిపీని కచ్చితంగా నైవేద్యంగా సమర్పించాలి. ఈసారి మీరు పెసరపప్పు హల్వా పెట్టేందుకు ప్రయత్నించండి. ఇది నోట్లో పెడితే కరిగిపోయేలా అద్భుతంగా ఉంటుంది. తినే కొద్ది తినాలనిపిస్తుంది.. దీన్ని వండడం కూడా చాలా సులువు. పెసరపప్పు హల్వా రెసిపీ ఇక్కడ మేము ఇచ్చాము.
25
పెసరపప్పు హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు ఒక కప్పు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెయ్యి అరకప్పు, పంచదార ఒక కప్పు సిద్ధం చేసుకోండి. పాలు లేదా నీరు ఒక కప్పు, యాలకుల పొడి అర స్పూను రెడీ చేయండి. ఇక జీడిపప్పులు, బాదం, కిస్మిస్లు వంటివి గార్నిషింగ్ కోసం ఒక గుప్పెడు తీసుకోండి.
35
పెసరపప్పు హల్వా రెసిపీ
పెసరపప్పు హల్వా మెత్తగా నోట్లో పెడితే కరిగిపోయేలా రావాలంటే పెసరపప్పును శుభ్రంగా కడిగి ముందుగానే ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నానిన పప్పును నీటిలోంచి తీసి మిక్సీజార్లో వేసుకోవాలి. అందులో నీరు లేదా పాలు వేసి మెత్తగా పేస్టులాగా రుబ్బుకోవాలి. అలాగని మరీ గట్టిగా రుబ్బుకోకూడదు. దోశ పిండి లాగా జారేలా కూడా రుబ్బుకోకూడదు. మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయండి. ఆ నెయ్యిలో రుబ్బిన పెసరపప్పు మిశ్రమాన్ని వేసి చిన్న మంట మీద వేయించండి.
పెపరపప్పు మిశ్రమం పచ్చివాసన పోయి అది కాస్త ముదురు రంగులోకి వచ్చే వరకు వేయించుకోండి. దాదాపు పావుగంట సేపు ఇలా వేయించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ పప్పులో పాలు లేదా నీరు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం చిక్కబడడం మొదలవుతుంది. ఆ సమయంలోనే పంచదారని, యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. పంచదార నీరుగా మారి మళ్ళీ మిశ్రమాన్ని పలుచగా చేస్తుంది. తర్వాత అది గట్టిపడే వరకు చిన్న మంట మీద ఉడికిస్తూ ఉండాలి. ఇక ఇది హల్వా లాగా గట్టిగా అయ్యాక పైన వేయించిన జీడిపప్పులు, బాదం, కిస్మిస్లను వేయాలి. అంతే రుచికరమైన పెసరపప్పు హల్వా రెడీ అయినట్టే.
55
బెల్లాన్ని కూడా వాడొచ్చు
కొంతమందికి పంచదారను వాడడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అలాంటి వారు బెల్లం తురుమును వాడుకోవచ్చు. బెల్లం తురుము ఆరోగ్యానికి మేలే చేస్తుంది. కాకపోతే పెసరపప్పు హల్వా ముదురు రంగులోకి వస్తుంది. కానీ రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ దీపావళికి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెసరపప్పు హల్వా పెట్టేందుకు సిద్ధమైపోండి.