ఆలయ స్థల పురాణం ప్రకారం, పూర్వం అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని చెబుతారు. ఇక్కడి అమ్మవారు స్వయంభూమూర్తి.మనస్సులో ఒక్క చిన్న 'తలపు' (ఆలోచన) వచ్చి అమ్మవారిని తలుచుకుంటే చాలు.. కోరిన కోరికలు తీర్చి, భక్తులను ఆపదలనుంచి కాపాడుతుందని, అందుకే అమ్మవారికి తలపులమ్మ తల్లి (తలుపులమ్మ అమ్మవారు) అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు.
ఈ ఆలయం ఎక్కడ ఉంది?
ఈ ప్రసిద్ధ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా, తుని మండలం 'లోవ' గ్రామంలో ఉంది.దారకొండ, తీగకొండ అనే రెండు కొండల మధ్య పచ్చని అటవీ వాతావరణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. జాతీయ రహదారి (NH16) వద్ద తుని - అన్నవరం మధ్యలో ఉండే ఆర్చ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో లోవ క్షేత్రం ఉంటుంది.
ఈ క్షేత్ర ప్రత్యేకత: ఈ ఆలయానికి కొత్త వాహనంపై కుటుంబంతో వచ్చి పూజ చేయించడం, కొండ దిగువన పచ్చని ప్రకృతి ఒడిలో వంటలు చేసుకుని మొక్కులు తీర్చుకోవడం దశాబ్దాలుగా వస్తున్న ఆచారం.
గమనిక: ఆధ్యాత్మిక విశ్వాసాలు భక్తులకు మనోధైర్యాన్ని ఇస్తాయి. అయితే ఏ వాహనానికైనా అసలైన రక్షణ హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం, పరిమిత వేగంతో ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి!