గారెలు అంటే ఎంతో మందికి ఇష్టం. కానీ పప్పును రుబ్బి వండాలంటే కష్టంగా అనిపిస్తుంది. అప్పటికప్పుడు పది నిమిషాల్లో గారెలు (Instant Garelu) ఎలా వేసుకోవాలో తెలుసుకోండి. ఇన్ స్టెంట్ గారెల రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
గారెలు పేరు చెబితేనే నోరూరిపోతుంది. కానీ అవి వేయాలంటే మినప్పప్పును ముందుగా నానబెట్టి రుబ్బి వేసుకోవాలి. ఇందుకు కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుంది. అందుకే చాలామంది గారెలను టిఫిన్ సెంటర్లలో కొనేసుకుంటారు. అలా కాకుండా మీరు రవ్వతో కూడా క్రిస్పీ గారెలు అప్పటికప్పుడు వేసుకోవచ్చు.
24
రవ్వ గారెల రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉప్మా రవ్వను ఒక కప్పు తీసుకొని పక్కన పెట్టుకోండి. నూనె డీప్ ఫ్రై చేయడానికి సరిపడా తీసుకోండి. ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిర్చి తరుగు రెండు స్పూన్లు, అల్లం తరుగు ఒక స్పూను, నీరు సరిపడినంత, కొత్తిమీర తరుగు మూడు స్పూన్లు తీసుకోండి. వంట సోడా చిటికెడు సిద్ధం చేసుకోండి.
34
రవ్వ గారెలు ఇలా వండేయండి
రవ్వ గారెలు తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నీరు వేయండి. ఆ నీటిలోనే అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు అందులో రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. రవ్వ కాస్త మెత్తగా అయ్యి దగ్గరగా అయ్యేవరకు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు రవ్వ గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి నూనె వేయండి. ఆ నూనె వేడెక్కేలోపు రవ్వ మిశ్రమం నుండి కొంత ముద్దను తీసి గారెల్లాగా ఒత్తుకొని మధ్యలో రంధ్రం పెట్టుకొని నూనెలో వేయండి. రెండు వైపులా రంగు మారేవరకు వేయించుకోండి. ఇలా రవ్వ మొత్తం వేసిన తర్వాత టేస్టీ గారెలు సిద్ధమైపోతాయి.
ఈ ఇన్ స్టెంట్ గారెల్లో మీరు వంటసోడా వేయడం మరిచిపోవద్దు. వంట సోడా వేయడం వల్ల ఇవి కాస్త క్రిస్పీగా వస్తాయి. ఈ క్రిస్పీ గారెలను టమాటో చట్నీతో తిన్నా, అల్లం చట్నీతో తిన్నా అదిరిపోతాయి. వీటితో పెరుగు వడలు కూడా చేసుకోవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అప్పటికప్పుడు మీకు గారెలు కావాలనిపిస్తే ఇలా ఇన్స్టెంట్ పద్ధతిలో చేసేయండి.