కోడిగుడ్డు తో (Egg Recipes) చేసే వంటకాలు అన్నీ రుచిగానే ఉంటాయి. మరి కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఉల్లికారం కోడి గుడ్డు వేపుడు చేసి చూడండి. నోరు చప్పగా అనిపించినప్పుడు ఇది అద్భుతంగా అనిపిస్తుంది. రెసిపీ కూడా చాలా సులువు.
కోడిగుడ్డుతో చేసే వంటకాలు అంటే ఇష్టమా? అయితే ఒకసారి ఇక్కడ మేము చెప్పిన విధంగా ఉల్లికారం కోడిగుడ్డు ఫ్రై చేసుకుని చూడండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో దీన్ని కలుపుకొని తింటే అమృతంలా అనిపిస్తుంది. దీని రెసిపీ కూడా చాలా సులువు. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేసేయండి.
25
ఉల్లికారం కోడి గుడ్డు వేపుడు రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉల్లిపాయల తరుగు ఒక కప్పు సిద్ధం చేసుకోండి. ఇక కోడిగుడ్లు మూడు నుంచి నాలుగు తీసుకోవాలి. కొత్తిమీర తరుగు గుప్పెడు, గరం మసాలా పావు స్పూను, పసుపు, ధనియాలు పొడి ఒక స్పూను తీసి పక్కన పెట్టుకోండి. గుప్పెడు కరివేపాకులు, జీలకర్ర ఒక స్పూను, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు పది, కారం మూడు స్పూన్లు రెడీ చేసుకోండి. ఇక నూనె రెండు నుంచి మూడు స్పూన్లు అవసరం పడుతుంది.
35
ఉల్లికారం కోడి గుడ్డు వేపుడు రెసిపీ
కోడిగుడ్లను ముందుగానే నీటిలో వేసి ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయలు, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి. ఆ నూనెలో జీలకర్ర, కరివేపాకులు వేసి బాగా వేయించండి. ఇప్పుడు మిక్సీలో రుబ్బుకున్న ఉల్లిపాయ కారం ముద్దను వేసి బాగా వేయించండి. దీన్ని చిన్న మంట మీద వేయించాలి. నూనె పైకి తేలే వరకు వేయిస్తూ ఉండాలి.
ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, పసుపు కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్లను ఇందులో వేసి కలుపుకోవాలి. మీరు కోడి గుడ్డును ముక్కలు చేసి కూడా వేసుకోవచ్చు. లేదా కోడిగుడ్లను అలానే వేసేయచ్చు. ఎలా వేసినా రుచిగానే ఉంటుంది. ఇప్పుడు రెండు నిమిషాలు చిన్న మంట మీద వేయించుకొని పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఉల్లికారం కోడి గుడ్డు వేపుడు రెడీ అయిపోతుంది.
55
ఉడికించిన గుడ్డే కాబట్టి
జ్వరం తగ్గిన తర్వాత నోరు చప్పగా మారిపోతుంది. నాలుకకు ఏ రుచీ తెలియదు. అలాంటప్పుడు ఉల్లి కారం కోడి గుడ్డు వేపుడు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. కోడిగుడ్డు ఉడికించి ఇందులో వేస్తాం కాబట్టి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అలానే ఉంటాయి. కోడిగుడ్డు తినడం వల్ల కండరాల బలంగా మారుతాయి. మెదడు ఆరోగ్యంగా మారుతుంది. కంటిచూపు కూడా పదునుగా మారుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.