ఈ బిర్యానీ మన దేశంలో అడుగుపెట్టడం వెనక పెద్ద చరిత్రే ఉంది. 18వ శతాబ్దంలో కర్ణాటకలోని బసవ కళ్యాణ్ ( బీదర్) నుంచి వచ్చిన కళ్యాణీ నవాబులు.. హైదరాబాద్ భాగ్య నగరంలో స్థిరపడ్డారు. చార్మినార్ సమీపంలోని షా ఆలీ బండా దగ్గర తమ హవేలీ నిర్మించుకున్నారు. బీదర్ నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి తమ హవేలీకి వచ్చే అతిథులకు, పర్యాటకులకు ఉచితంగా ఈ బిర్యానీతో ఆతిథ్యం ఇచ్చేవారు. 1948 తదుపరి కాలంలో నవాబుల వైభవం తగ్గిపోవడంతో, వారి వంటశాలలో పనిచేసే రాచరిక వంట మనుషులు ఉపాధి కోసం బయటకు వచ్చి వీధుల్లో చిన్న చిన్న బండ్లు, హోటళ్లు ఏర్పాటు చేశారు. నవాబుల వంటశాల జ్ఞాపకార్థంగా కళ్యాణీ బిర్యానీ అనే పేరు పెట్టి చార్మినార్ సమీపంలో అమ్మడం ప్రారంభించారు. తర్వాత.. హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఈ బిర్యానీ అందుబాటులో ఉంది.
కళ్యాణీ బిర్యానీని పేదల బిర్యానీ అని ఎందుకు పిలుస్తారు..?
హైదరాబాద్ లో మామూలు చికెన్ లేదా మటన్ బిర్యానీ ధర రూ.250 నుంచి రూ.400 వరకు ఉంటుంది. అదే కళ్యాణీ బిర్యానీ సింగిల్ ప్లేట్ కేవలం రూ.60 నుంచి రూ.100 లోపే లభిస్తుంది. తక్కువ బరువులో ప్రోటీన్, కడుపు నిండా కమ్మని అన్నం లభించడంతో రోజువారీ కూలీలు, విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులకు ఇది అత్యంత చవకైన ఆహారంగా మారింది. అందుకే, ఈ బిర్యానీని పేదల బిర్యానీగా పిలుస్తారు.