ఈ నూనెలతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు తొందరగా తగ్గుతాయి..

First Published Jan 2, 2023, 10:40 AM IST

చలికాలంలో కీళ్ల నొప్పులు రావడం, ఉన్న నొప్పులు మరింత ఎక్కువ కావడం చాలా సహజం. ఈ నొప్పికి ఎన్నో కారణాలున్నాయి. అయితే కొన్ని నూనెలతో మసాజ్ చేస్తే మాత్రం నొప్పులు ఇట్టే తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

కీళ్ల నొప్పులు ఒకప్పుడు 50 నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే వచ్చేవి. ఇప్పుడు 30 నుంచి 40 ఏండ్ల వారికి కూడా వస్తున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. పూర్తిగా మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ చేయకపోవడం వంటి కారణాల వల్ల కీళ్ల నొప్పులు వస్తుంటాయి. అయితే కీళ్ల నొప్పులు చలికాలంలో కూడా వస్తుంటాయి. అంతేకాదు ఈ సీజన్ లో ఈ కీళ్ల నొప్పులు కాస్త ఇంకా ఎక్కువ అవుతాయి. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఏదేమైనా ఈ నొప్పుల వల్ల నడవడం, కూర్చోవడం, పడుకోవడం కూడా కష్టంగానే ఉంటుంటి. వీటివల్ల వాళ్ల పనులు కూడా చేసుకోలేకపోతుంటాయి. అయితే కొన్ని రకాల నూనెలతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బాదం నూనె

బాదం నూనె మన ఆరోగ్యానికి ఎన్నో విధాల మేలు చేస్తుంది. ఇది చర్మానికి, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. దీనిలో విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం బాదం నూనెను కొద్దిగా తీసుకుని గోరువెచ్చగా చేయండి. ఆ తర్వాత ఆ నూనెతో కీళ్లకు బాగా మసాజ్ చేయండి. ఇలా తరచుగా చేస్తుంటే కీళ్ల నొపుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

coconut oil

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. అందుకే కొబ్బరి నూనెను కేరళ వాళ్లు వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఈ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి.  ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. ఎన్నో ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి. అంతేకాదు ఈ నూనె గుండెను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. అంతేకాదు ఒంటి నొప్పులను, తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పుల నుంచి కూడా ఈ నూనె ఉపశమనం కలిగిస్తుంది. ఈ నూనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనార్జేసిక్ లక్షణాలు మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. 

ఆవనూనె

ఆవనూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఈ నూనెతో కీళ్లకు మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు, వాపు తగ్గిపోతాయి. ఇందుకోసం కొద్దిగా ఆవనూనెను తీసుకుని అందులో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను వేసి మరిగించండి. ఇది చల్లారిన తర్వాత పాదాలకు, కీళ్లకు మసాజ్ చేయండి. 
 

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఈ నూనెతో మోకాళ్లను మసాజ్ చేయడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నూనెతో పాదాలకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే కండరా తిమ్మరి, నొప్పి తగ్గిపోతాయి. దీన్ని కాళ్లకు మసాజ్ చేస్తే అలసట తగ్గిపోతుంది. హాయిగా నిద్రపడుతుంది కూడా. 
 

నువ్వుల నూనె

నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఇ, విటమిన్ బి కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ నూనెను  మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఈ నూనెతో కీళ్లకు మసాజ్ చేయడం వల్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. 
 

click me!