ఈ ఆచారానికి హిందూ ఇతిహాసమైన మహాభారతంతో బలమైన ముడి ఉంది. మహాభారతంలో ద్రౌపది ఐదుగురు పాండవులను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ , సిర్మూర్ ప్రాంతాల ప్రజలు తమను తాము పాండవుల వారసులుగా భావిస్తారు. పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఈ ప్రాంతాలలో గడిపారని, అప్పుడే ఈ సంప్రదాయం ఇక్కడ అలవాటు పడిందని.. స్థానికులు గట్టిగా నమ్ముతారు.
ఇప్పటికీ ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయా? అంటే... అవును. ఇప్పటికీ ఇక్కడ ఇలాంటి వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్, సిర్మూర్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఈ ఆచారం ఇప్పటికీ అక్కడక్కడ మనుగడలో ఉంది.
ఇటీవలి కాలంలో కూడా సిర్మూర్ జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన కొందరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న ఘటనలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఈ వివాహాలు పూర్తిగా అందరి సమ్మతితో, బహిరంగంగానే జరుగుతుంటాయి.
చట్టబద్ధత: ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ చట్టాలు ఈ 'జోడిదార' సంప్రదాయాన్ని గుర్తించాయి. ఐపిసి సెక్షన్లు 494, 495 కింద సాధారణంగా బహుభార్యాత్వం లేదా బహుభర్తృత్వం చట్టవిరుద్ధమైనప్పటికీ, కొన్ని గిరిజన ప్రాంతాల ప్రత్యేక ఆచారాలకు ఇక్కడ మినహాయింపులు ఉన్నాయి.
కాలం మారుతున్న కొద్దీ ఆధునిక విద్య, పట్టణీకరణ ప్రభావంతో ఈ సంప్రదాయం వేగంగా కనుమరుగవుతోంది. మహిళల్లో చైతన్యం పెరగడం, వ్యక్తిగత హక్కులపై అవగాహన రావడంతో యువత ఈ పద్ధతికి దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఇది చాలా అరుదుగా, కేవలం కొన్ని మారుమూల గ్రామాలలోని సంప్రదాయ కుటుంబాలకు మాత్రమే పరిమితమైంది.