Walking Tips: చాలా మంది బరువు పెరిగినట్టు అనిపిస్తే చాలు తెగ ఎక్సర్ సైజ్లు, డైటింగ్ పాటిస్తూ ఉంటారు. అవి ఎన్ని రోజులు మహా అయితే రెండే రెండు రోజులు మాత్రమే. ఆ తర్వాత ఇవి నా వల్ల కావురా బాబో అనుకుంటూ హాయిగా బజ్జుంటారు. కానీ ఎదైనా చేయాలని గట్టిగా ఫిక్స్ అయినప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. ఎందుకంటే మనం ఏదైనా సాధించాలనకున్నప్పుడు పట్టుదల ఎంతో అవసరం. అది ఉంటేనే ఎంతటి సమస్యనైనా ఈజీగా జయించొచ్చు. అలాగే వెయిట్ లాస్ కోసం మీరు ఎంచుకున్న పద్దతులను ఎప్పుడూ విస్మరించకూడదు. అది డైటింగ్ అయినా, వ్యాయామం అయినా మరేదైనా.. కానీయండి. ఒక సారి వెయిట్ లాస్ కోసం మన ప్రయత్నం మొదలు పెడితే.. దాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఈ సంగతి పక్కన పెడితే.. నడక ద్వారా కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఇది ఏదో రెండు అడుగులు వేశామా.. అయిపోయిందా అన్నట్టు కాకుండా ఒక రూల్ లా పాటించాలి. ఈ నడకకు కొన్ని నియమ నిబంధనలున్నాయి. వాటిని సక్రమంగా పాటిస్తేనే మీ బరువును కోల్పోగలుగుతారు. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మరి ఆ నడక ఎలా నడవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ప్రతిరోజూ కనీసం 30 నుంచి 90 నిమిషాలు తప్పకుండా నడవాలి. ఇలా కుదరకపోతే వారానికి 150 నిమిషాలు నడిచినా మంచి ఫలితం ఉంటుంది. కానీ నడకను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. క్రమం తప్పకుండా నడవాలి.
మీరు నడిచే విధానాన్ని బట్టి మీరు ఎంతసేపట్లో ఎంత దూరం వెళ్లగలరో ఒక అంచనాకు రావొచ్చు. అర్థగంట సేపు నడిస్తే సుమారుగా రెండున్నర కిలోమీటర్ల నుంచి 3.3 కిలోమీటర్ల దూరం నడవొచ్చు. ఇది సాధారణంగా నడిస్తేనే. అదే మీ నడక స్పీడ్ గా ఉండే మరింత దూరం వెళతారు.
వాకింగ్ చేస్తునప్పుడు మీ శరీరంలో ఉన్న కొవ్వు కరగడం మొదలవుతుంది. మీరు ఒక అర్థగంట పాటు నడిస్తే గనక 100 నుంచి 300 క్యాలరీలు ఈజీగా ఖర్చైపోతాయి. అంతేకాదు ఒక ముప్పై నిమిషాల పాటు నడవడం వల్ల శరీరంలో నిల్వ ఉండే చక్కెర, కొవ్వులు ఇందనంలా మండుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ నడక మరీ నెమ్మదిగా కూడా ఉండొద్దు. ఎలా ఉండాలంటే.. శరీరం అంతా కదిలేలా.. ఫాస్ట్ ఫాస్ట్ గా ఉండాలన్నమాట. ఇలా వేగంగా నడిస్తే ఊపిరి ఎక్కువ సార్లు పీల్చుకుంటారు. దీనివల్ల మీ శ్వాసక్రియ మెరుగ్గా పనిచేస్తుంది.
ఒకవేళ మీరు కిడ్నీ, గుండె జబ్బులు, డయాబెటీస్ సమస్యలతో బాధపడితే వైధ్యుడిని సంప్రదించిన తర్వాతే వాకింగ్ చేయాలి. లేదంటే ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. ఫస్ట్ టైం వాకింగ్ చేసేవారు ఎక్కువ దూరం నడవాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి వారు 10 లేదా 15 నిమిషాలు నడిచి ఆ తర్వాత కొంత సమయం రెస్ట్ తీసుకుని నడిస్తే బెటర్.
వాకింగ్ చేయాలి కదా అని నిద్రలేచిన వెంటనే నడవడం అంత మంచిది కాదు. లేచాక కొద్ది సేపు వార్మ్ అప్ చేయాలి. ఆ తర్వాతే నడవాలి. నడుస్తున్నప్పుడు మీ చేతులు వెనక్కి ముందుకు కదిలేలా చూడాలి.