వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అంటే తగినంత నీరు ఎప్పుడూ శరీరంలో ఉంచుకోవాలి. సాధారణంగా మనిషి రోజుకు 3-4 లీటర్ల వరకు నీళ్లు తాగడం మంచిది. అయితే ఇది వయస్సు, శరీర బరువు, చేసే పని, వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంటుంది.
ఎవరు ఎంత నీరు తాగాలి?
సాధారణ వ్యక్తులైతే రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. అంటే ఇళ్లలో ఉండే మహిళలు, ఎక్కువ శారీరక శ్రమ చేయని వారు ఇంత నీరు తాగాలి.
విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చుని పనిచేసే వారు రోజుకు 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల నీరు తాగాలి.
బయట ఎక్కువగా తిరిగే వారు, ఎండలో పనిచేసే కూలీలు రోజుకు 4 లీటర్ల నుంచి 5 లీటర్ల నీరు తాగాలి.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అంటే.. కిడ్నీ, గుండె, షుగర్ సంబంధిత సమస్యలు ఉన్న వారు డాక్టర్ సలహా తీసుకుని తగినంత నీరు తాగాలి.
నీరు తాగడానికి సరైన విధానం
ఎప్పుడు తాగినా నీరు కొద్దికొద్దిగానే తాగాలి. అందుకే మనం ఎవరింటికి వెళ్లినా ముందుగా ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి తాగమంటారు. అంతే.. ఎప్పుడైనా ఒక గ్లాస్ వాటర్ తాగితే సరిపోతుంది. ఆ నీటిని శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుంది. ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఇబ్బంది కలుగుతుంది.
తియ్యగా ఉండే డ్రింక్స్, సోడాలు ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. దాహం వేసినప్పుడు ఇవి అస్సలు తాగకూడద. ఎందుకంటే నీటికి ఇవి ప్రత్యామ్నాయం కాదు. పైగా ఇవి తాగితే డీహైడ్రేషన్ కలిగించవచ్చు.
గోరువెచ్చని నీరు లేదా గది ఉష్ణోగ్రత ఉన్న నీరు తాగితే మంచిది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు రావు. చాలా చల్లటి నీరు తాగితే జీర్ణ సమస్యలు రావొచ్చు.
వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కువ చెమట పట్టే సమయాల్లో కూడా నీరు ఎక్కువగా తాగడం ముఖ్యం. కాని ఒక్కసారిగా తాగకూడదు.
ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగడం మంచిదా?
వేసవి కదా.. టెంపరేచర్ ఎక్కువగా ఉంది కదా అని ఒకేసారి లీటరుకు పైగా నీళ్లు తాగడం మంచిది కాదు. దాహం ఎక్కువగా ఉందని మీరు ఎక్కువ నీరు తాగినా శరీరం మాత్రం అవసరమైనంత నీటిని మాత్రమే ఉపయోగించుకుంటుంది. మిగిలిన దాన్ని మూత్రంగా బయటకు పంపిస్తుంది.
వేసవిలో ఒకేసారి ఎక్కువ నీరు తాగితే..
ఒక్కసారిగా లీటరు, లీటరున్నర నీరు తాగితే హైపోనాట్రీమియా అనే సమస్య రావొచ్చు. దీనిర్థం నీరు విషతుల్యం (Water Intoxication) అయిపోతుంది. ఇది రక్తంలో సోడియం స్థాయిని తగ్గిస్తుంది. దీంతో ఒళ్లు అదిరిపోవడం, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. నీరు భారీ మొత్తంలో తాగితే ఒక్కోసారి కోమాలోకి వెళ్లే పరిస్థితి కూడా రావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
వేసవిలో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే
మీరు కచ్చితంగా ఎండలో వెళ్లాల్సి వస్తే ముందుగానే కొంచెం నీరు తాగి వెళ్లండి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం ముఖ్యం.
ఎండలో బయట పనులు చేస్తుంటే మధ్యలో ఎలక్ట్రోలైట్ వాటర్ తాగండి. కొబ్బరి నీరు, నిమ్మరసం లాంటి వాటిని తాగడం మంచిది.
వేసవిలో కచ్చితంగా మర్చిపోకుండా టైమ్ కి నీరు తాగాలి. అది కూడా కొంచెం కొంచెం తాగాలి. అందుకు నీరు తాగాలని అలారం పెట్టుకోవడం మంచిది. దీంతో మర్చిపోకుండా ఉంటారు.
ఇది కూడా చదవండి వేసవిలో ప్రతి నీటి బొట్టు బంగారమే.. నీటిని పొదుపుగా వాడేందుకు సింపుల్ టిప్స్