పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల ఇది శరీరానికి క్షణాల్లో శక్తిని అందిస్తుంది. అయితే, ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇది పూర్తి స్థాయి సంపూర్ణ ఆహారం కాదు. అయితే, దీని వల్ల కొన్ని ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం కలుగుతాయి.
సులభంగా జీర్ణమవుతుంది: కడుపులో సమస్యలు ఉన్నప్పుడు లేదా అనారోగ్యం నుంచి కోలుకుంటున్నప్పుడు సగ్గుబియ్యం చాలా సులభంగా జీర్ణమై కడుపుకు హాయిని ఇస్తుంది.
శరీరానికి చలువ చేస్తుంది: ఆయుర్వేదం ప్రకారం ఇది శరీర వేడిని తగ్గించి, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది.
బరువు పెరగడానికి, శక్తికి: తక్కువ సమయంలో ఎక్కువ శక్తి కావాల్సిన వారికి , బరువు పెరగాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
ఉపవాస సమయంలో దీనిని మాత్రమే ఎందుకు తీసుకోమని చెబుతారు?
మన సంప్రదాయంలో ఉపవాసాల సమయంలో సగ్గుబియ్యం వంటకాలను విరివిగా వాడటానికి కొన్ని శాస్త్రీయ, ఆచారపరమైన కారణాలు ఉన్నాయి:
తక్షణ శక్తి : ఉపవాసాలు ఉన్నప్పుడు రోజంతా నీరసంగా ఉండకుండా, సగ్గుబియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే శక్తిని అందించి యాక్టివ్‌గా ఉంచుతాయి.
కడుపు నిండుగా భావన: ఇది కడుపును నిండుగా ఉంచడమే కాకుండా, అజీర్తి సమస్యలు రాకుండా తేలికపాటి ఆహారంగా పనిచేస్తుంది.
సులభమైన వంటకాలు: ఉపవాస నియమాలకు అనుగుణంగా తక్కువ పదార్థాలతో, పాలు లేదా పెరుగుతో కలిపి వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు.