పిండిలో పురుగులు, లార్వాలు లేదా వలలు స్పష్టంగా కనిపిస్తే, ఆ పిండిని ఏమాత్రం వాడకుండా ఒక ప్లాస్టిక్ కవర్ లేదా కవరులో గట్టిగా మూసివేసి బయట చెత్తబుట్టలో పడేయడం ఉత్తమం. పిండి ఉన్న అరలోని బియ్యం, పప్పులు, రవ్వ, మసాలాలు, బిస్కెట్ ప్యాకెట్లను కూడా వెంటనే చెక్ చేయండి. ఎందుకంటే ఈ పురుగులు ఒక డబ్బా నుంచి మరొక డబ్బాలోకి వేగంగా వ్యాపిస్తాయి. అరలలోని మూలల్లో, సందుల్లో ఒలికిన పిండి రేణువులు ఉంటే వాటిని వాక్యూమ్ క్లీనర్‌తో లేదా తడి గుడ్డతో క్షుణ్ణంగా శుభ్రం చేయండి.
పురుగులు పట్టకుండా ఉండేందుకు స్మార్ట్ కిచెన్ చిట్కాలు:
పిండి, ధాన్యాలను తెరిచి ఉన్న కవర్లలో ఉంచకుండా, గాలి చొరబడని గాజు లేదా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ ఎయిర్ టైట్ డబ్బాలలోనే నిల్వ చేయండి. పిండి లేదా బియ్యం డబ్బాల్లో 2-3 బిర్యానీ ఆకులు, కొన్ని లవంగాలు లేదా ఎండిన వేపఆకులు వేసి ఉంచితే వాటి ఘాటైన వాసనకు పురుగులు దరిచేరవు.
మార్కెట్ నుంచి పిండి లేదా రవ్వ తెచ్చిన వెంటనే ఆ ప్యాకెట్‌ను 24 నుంచి 48 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచండి. దీనివల్ల అందులో ఏవైనా కంటికి కనిపించని గుడ్లు ఉంటే పూర్తిగా నశిస్తాయి. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ లేదా సేమియా వంటివాటిని తెచ్చిన వెంటనే బాణలిలో దోరగా వేయించి, చల్లారాక డబ్బాలో పోసి పెట్టుకుంటే ఎన్ని నెలలైనా పురుగు పట్టదు.
సరుకులు కొనేటప్పుడే ప్యాకెట్ ఎక్కడైనా చిరిగిపోయిందో లేదా ఎక్స్‌పైరీ డేట్ దగ్గరపడిందో సరిచూసుకోండి. ముందుగా ఇంటికి తెచ్చినవి వాడి.. ఆ తర్వాతే కొత్తవి వాడటం ఉత్తమం.