గుండె జబ్బులు రాకూడదంటే.. ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయండి..

First Published Nov 18, 2022, 9:45 AM IST

గుండె జబ్బులను అంత తొందరగా తగ్గించుకోలేం. ఇవి ఒక్కోసారి మన ప్రాణాలు కూడా తీయొచ్చు. ఆడ, మగ అంటూ తేడా లేకుండా ఈ రోగాలొస్తయ్. అందుకే గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. 
 

మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం.. దాని విధులను సక్రమంగా నిర్వర్తిస్తేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం.. అయితే మన బాడీలో ఉన్న అన్ని అవయవాల కంటే గుండె ఆరోగ్యమే ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే గుండె కొట్టుకున్నంత వరకే మనం జీవిస్తం.. గుండె కొట్టుకోవడం ఆగిపోతే మనం ఇక లేనట్టే. కానీ ప్రస్తుతం మరణిస్తున్నవారిలో.. చాలా మంది గుండెకు సంబంధించిన రోగాలతోనే  ప్రాణాలు విడుస్తున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 

heart

నిజం చెప్పాలంటే గుండె జబ్బులు ప్రాణాంతకమైనవి. ఇవి చేయిదాటితే వీటిని మనం పూర్తిగా నయం చేయలేము. ఈ గుండె జబ్బులకు ఆడ, మగ అంటూ తేడా ఏం ఉండదు. ఇవి లింగంతో సంబంధం లేకుండా ఎవ్వరికైనా రావొచ్చు. గుండె జబ్బులను సకాలంలో గుర్తిస్తే.. మంచి చికిత్స తీసుకుని నయం చేసుకోవచ్చు. అయినప్పటికీ మన లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులను చేసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

మంచి నిద్ర

మన మొత్తం శరీర ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా చాలా అవసరం. నిద్రతోనే ఎన్నో రోగాల  ముప్పు తప్పుతుంది. ముఖ్యంగా గుండెకు సంబంధించిన రోగాలొచ్చే ప్రమాదమే ఉండదు.  గాఢమైన, నాణ్యత కలిగిన నిద్రతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చంటున్నారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. నిద్ర ఆహారం, వ్యాయామం కంటే చాలా ముఖ్యమైందని చెబుతున్నారు.  సరిగ్గా నిద్రపోని వారికి అధిక రక్తపోటు, డయాబెటీస్, మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ గుండెపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. అందుకే కంటి నిండా నిద్రపోండి. రోజుకు 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

క్రమ బద్దమైన జీవన శైలి

ఒక్క నిద్ర విషయంలోనే కాదు.. జీవన శైలి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా  అన్ని పనులు టైం ప్రకారమే చేయాలి. లేకపోతే.. మీ లైఫ్ స్టైల్ మీ గుండెను ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఒత్తిడి వంటివి పక్కన పెట్టండి. మీకోసం కాస్త సమయాన్ని కేటాయించండి. రాత్రిపూట వీలైనంత ఎక్కువ నిద్రపోండి. ఉదయం తొందరగా మేల్కోండి. సాధ్యమైనంత వరకు ప్రతిరోజూ ఒకే సమయంలో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా మంచిది. రోజూ ఏ సమయంలో చేయాల్సిన పనులను.. ప్రతిరోజూ అదే సమయంలో చేయండి. దీనివల్ల మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 

healthy food

ఆరోగ్యకరమైన ఆహారం

గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి మనం చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం. మీరు తినే  ఆహారంలో  ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. గుండె ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. గుడ్లు, చేపలు (సార్డినెస్, మాకేరెల్ మరియు నథోలి వంటి అన్ని చేపలు) అన్నీ తినొచ్చు. ఒక వేళ  మీరు శాఖాహారులైతే దానికి అనుగుణంగా ప్రోటీన్ ఆహారాలను తినేలా చూసుకోండి. 

click me!