శీతాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువుంటే లేనిపోని రోగాలొస్తయ్.. అందుకే వీటిని తినండి

First Published Nov 10, 2022, 2:06 PM IST

చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతూ ఉంటుంది. దీంతో దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్ లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను ఖచ్చితంగా తినాలని డాక్టర్లు చెప్తున్నారు. 
 

ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు అతని రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటం చాలా అవసరం. అయితే శీతాకాలంలో తరచుగా రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా మారుతూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటే లేనిపోని రోగాలొచ్చే అవకావం ఉంది. అందుకే  ఈ సీజన్ లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తినాలి. పౌష్టికాహారం ద్వారా రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్లు ఎ, సి, డి లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 
 

పసుపు

పసుపు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. పసుపు ఒక్క రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు.. కొలెస్ట్రాల్ ను తగ్గించడం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పసుపులో కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే మీ వంటల్లోనే కాకుండా.. మీరు ప్రతిరోజూ తాగే పాలలో చిటికెడు పసుపును వేసుకుని తాగితే.. ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది.
 

అల్లం

అల్లం రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం మీ ఆహారంలో కొద్ది మొత్తంలో అల్లాన్ని చేర్చండి. అలాగే అల్లం టీని తాగండి. అల్లం మీ జీర్ణక్రియను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
 

విటమిన్ సి ఫుడ్స్

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయని ప్రతి ఒక్కరికీ తెలుసు. నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నారింజ కూడా శీతాకాలంలో మీరు తినగలిగే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండు. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి  మీ ఆహారంలో ద్రాక్ష, నిమ్మకాయలు, కివిని చేర్చవచ్చు.
 

apples

ఆపిల్

రోజూ ఒక ఆపిల్ ను తినడం వల్ల డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అన్న మాట ముమ్మాటికీ నిజం. ఆపిల్స్ లో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే, తక్కువ క్యాలరీలు ఉన్న ఆపిల్ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీర మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.
 

జామకాయ

జామ ఔషధ గుణాల భాండాగారం. జామపండులో విటమిన్ ఎ,విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ఉంటాయి.  ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో  సహాయపడుతుంది. జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇవి అంటువ్యాధులు, వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. .
 

క్యారెట్లు

శీతాకాలంలో తప్పకుండా తినాల్సిన కూరగాయలలో క్యారెట్లు ఒకటి. క్యారెట్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, బయోటిన్, పొటాషియం, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. క్యారెట్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
 

click me!