
గుమ్మడి గింజల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. గుమ్మడి కాయతో వంటలు కూడా చేసుకుని తింటుంటారు. దీన్ని స్వీట్ల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. కానీ చాలా మంది గుమ్మడి గింజలు దేనికీ పనికిరావని డస్ట్ బిన్ లో వేస్తుంటారు. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఈ పని ఇంకెప్పుడూ చేయరు తెలుసా..?
గుమ్మడి గింజల్లో ఫోలేట్, బీటా కెరోటిన్, విటమిన్ ఇ, ఐరన్, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. దీంతో పక్షవాతం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
గుమ్మడి గింజల్లో ఉండే విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. పునరుత్పత్తి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ విటమిన్ ఎ కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఒత్తిడి తగ్గుతుంది: పని, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వంటి ఎన్నో కారణాల ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడి కొన్ని రోజులకు డిప్రెషన్ కు దారితీస్తుంది. ఈ డిప్రెషన్ వల్ల మానసిక ఆరోగ్యమే కాదు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే ఒత్తిడిని మొదట్లోనే తగ్గించుకోవాలి. అయితే గుమ్మడి విత్తనాలు ఒత్తిడిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. వీటిలో ఉండే మెగ్నీషియం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీటిలో ఉండే విటమిన్ బి, జింక్ లు కూడా టెన్షన్ ను తొలగిస్తాయి.
నిద్రలేమి: నిద్ర మన శరీరానికి చాలా అవసరం. కారణాలేవైనా.. నిద్రకు భంగం కలిగితే మాత్రం.. అటు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇటు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నిద్రలేమి వల్ల బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి గుమ్మడి గింజలు మెడిసిన్ లా పనిచేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇవి రాత్రిళ్లు మీరు హాయిగా నిద్రపోయేందుకు సహాయపడతాయి.
మధుమేహులకు మంచివి: గుమ్మడి గింజలు షుగర్ పేషెంట్ తప్పకుండా తినాలి. ఎందుకంటే దీనిలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం వల్ల కలిగే సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతకాదు దీనిలో ఉండే ఔషదగుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటేనే ఎక్కడ లేని రోగాలు చుట్టుకుంటాయి. అయితే గుమ్మడి గింజలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచి.. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. దీనిలో ఉండే విటమిన్ ఇ నే ఇమ్యూనిటీని పెంచుతుంది.