
కాలాలు మారుతున్నప్పుడు వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తాయి. వీటివల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం, మలబద్దకం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇంకొందరైతే ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఫేస్ చేస్తుంటారు. సీజన్ మారినప్పుడు జ్వరం చాలా సాధారణంగా వస్తుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి బెల్లం సహాయపడుతుంది. రోజూ ఒక బెల్లం ముక్కను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
మన శరీరంలోని కలుషితమైన పదార్థాలన్నింటినీ తొలగించడాని బెల్లం ఎంతో సహాయపడుతుంది. 2009 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని కనుగొన్నారు. అలాగే సైటో ప్రొటెక్టివ్ క్వాలిటీ ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందులోనూ ఈ సీజన్ లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారు రోజూ చిన్న బెల్లం ముక్కను తింటే ఊపిరితిత్తులకు ఎలాంటి ప్రమాదం జరగదు.
ఈ సీజన్ లో కడుపునకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అంటే ఈ చల్లని వాతావరణంలో ఆహారం అంత సులువుగా జీర్ణం కాదన్న మాట. ఈ అజీర్థి మలబద్దకానికే కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి సమస్యలు రాకూడదంటే రోజూ బెల్లం తినాల్సిందేనంటున్నారు నిపుణులు. ఎందుకంటే బెల్లం ఆహారం సులువుగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. అలాగే మలబద్దకం సమస్యలను కూడా తొలగిస్తుంది.
ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల వైరస్ లు, ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు, ఇతర రోగాలు అటాక్ చేస్తున్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలంటే రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. అయితే ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బెల్లం సహాయపడుతుంది. కొద్ది మొత్తంలో బెల్లాన్ని తినడం వల్ల జబులు, ప్లూ, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి బెల్లం అందిస్తుంది.అందుకే చిన్న బెల్లం ముక్కను రోజూ తినండి.
మహిళలు, పిల్లల్లోనే రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మనిషిని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. అయితే బెల్లం రక్తహీనతను పోగొట్టడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో ఐరన్, ఫాస్ఫరస్ లు ఉంటాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి సహాయపడుతుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు బెల్లం తినవచ్చు.
ఓవర్ వెయిట్ ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అందుకే బరువు తగ్గేందుకు రోజూ ప్రయత్నిస్తుంటారు. అయితే బరువు తగ్గాలంటే చక్కెర పదార్థాలను తినకూడదు. అయితే చక్కెరకు బదులుగా బెల్లాన్ని మాత్రం ఎంచక్కా తినొచ్చు. బెల్లం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఏదైనా తీపి వంటకం తయారు చేయడానికి చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించండి. దీనిలో ప్రయోజనకరమైన పదార్థాలు ఉన్నాయి. దీని వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
వీటితో పాటుగా ప్రతిరోజూ పుష్కలంగా నీటిని తాగాలి. రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగితేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఇది ఒక్కోసారి ప్రాణాలను కూడా తీస్తుంది. నీటిని పుష్కలంగా తాగితే ఆరోగ్యంతో పాటుగా అందం కూడా మీ సొంతమవుతుంది. పొట్ట సమస్యలు కూడా తొలగిపోతాయి.