ఈ కలర్ ద్రాక్షలను తింటే.. ఎన్ని రోగాలు తగ్గిపోతాయో..!

First Published Feb 7, 2023, 3:56 PM IST

ద్రాక్షలంటే అందరికీ ఇష్టమే. కానీ వీటినే ఎక్కువగా తినరు. నిజానికి రోజుకు ఒక గిన్నె ఎర్ర ద్రాక్షలను తింటే డయాబెటీస్, చర్మ క్యాన్సర్, అధిక రక్తపోటు అంటూ ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఈ పండులో గ్లైసెమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పండ్లు మన మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. 
 

ద్రాక్షలు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఇందులో ఎరుపు రంగు ద్రాక్షలు ఎంత అందంగా ఉంటాయో మనందరికీ తెలుసు. ఇవి ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి తెలుసా?  రోజుకు ఒక గిన్నె ఎర్ర ద్రాక్షలను తినడం మీ చర్మం, గుండె ఆరోగ్యం, మెదడు, కళ్ళు, రోగనిరోధక వ్యవస్థకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాదు ఇవి క్యాన్సర్, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ నుంచి కూడా మనల్ని ఈ పండ్లు రక్షిస్తాయి. 

ఎర్ర ద్రాక్షలో ఉండే ప్రత్యేక పోషక విలువలు 

నిజానికి ఎర్ర ద్రాక్షలో చాలా తక్కువ కేలరీలు, కొవ్వు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఈ పండ్లు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. అందుకే చర్మ కాంతిని పెంచడానికి డైటీషియన్లు ఈ ఎర్ర ద్రాక్షలను ఎక్కువగా తినాలని సలహానిస్తుంటారు. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి -6, విటమిన్ కె, ఫోలేట్, జింక్, రాగి, పొటాషియం, మాంగనీస్, కాల్షియం లు ఉంటాయి. 
 

grape

ఈ పండ్లలో రెస్వెరాట్రాల్ అనే మూలకం కూడా ఉంటుంది. ఇది పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎర్ర ద్రాక్ష తొక్కల్లో ఈ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. రెస్వెరాట్రాల్ క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ఎన్నో ప్రాణాంతక సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లను రోజూ తినడం వల్ల ఎలాంటి లాభాలున్నాయంటే..

grapes

తక్కువ అనారోగ్యానికి గురవుతారు 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎర్ర ద్రాక్షలను క్రమం తప్పకుండా తింటే మీరు తక్కువ అనారోగ్యానికి గురవుతారు. దీనికి కారణం ఈ పండ్లు మీ రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఎర్ర ద్రాక్షలో శరీర రోగనిరోధక శక్తిని పెంచే అనేక పోషకాలు ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ మెరుగ్గా ఉంటేనే మన శరీరం ఎన్నో రోగాల ముప్పు నుంచి తప్పించుకుంటుంది. 
 

చర్మ క్యాన్సర్ ను నివారిస్తుంది 

ఎర్ర ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ ను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ యాంటీఆక్సిడెంట్ సూర్యుని హానికరమైన కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది. దీంతో చర్మ క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 
 


గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది

ఎర్ర ద్రాక్షలు, వీటి నుంచి తయారైన వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ గుండె సరిగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. ఎర్ర ద్రాక్షలో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ అని పిలువబడే రెండు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మంటను తగ్గించి.. రక్త నాళాలను సరిగ్గా ఆపరేట్ చేస్తుంది. ఎర్ర ద్రాక్ష శరీరంలో ప్లేట్లెట్స్ గడ్డకట్టే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది.
 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది 

ఈ రంగు ద్రాక్షలో ఎక్కువ మొత్తంలో ఫైబర్, నీరు ఉంటుంది. ఈ పండ్లను తిన్న తర్వాత మీ కడుపు చాలా వరకు నిండుతుంది. అందుకే బరువు తగ్గడానికి చాలా మంది ఎర్ర ద్రాక్షలను తింటుంటారు. 
 

రక్తపోటును నియంత్రిస్తుంది 

ఎర్ర ద్రాక్షలు పొటాషియానికి మంచి మూలం. ఈ పొటాషియం మన శరీరంలో సోడియం ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. దీంతో అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అందుకే బీపీ పేషెంట్లు ఎర్ర ద్రాక్షలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 

మానసిక ఆరోగ్యానికి మంచిది

ఎర్ర ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ రక్తనాళాలకు రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. దీనివల్ల మెదడులో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఇది మనల్ని తాజాగా, శక్తివంతంగా ఉంచుతాయి. అంతేకాదు ఇవి మనలో ఒత్తిడిని తగ్గిస్తాయి. అంటే ఎర్ర ద్రాక్షలను తినడం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది

డయాబెటిస్  పేషెంట్లు ఈ పండును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. తీపి పండ్లు వారి చక్కెర స్థాయిని పెంచుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ  గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లు డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు శరీరంలో రక్తంలో చక్కెరను వెంటనే పెంచవు. ఎర్ర ద్రాక్షలో గ్లైసెమిక్ ఇండెక్స్ 53 ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగులకు కూడా అనువైన పండు.

click me!