ఎండుద్రాక్షలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ఈ డ్రై ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది కూడా. దీనిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులో టారోటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది కడుపునకు సంబంధించిన సమస్యలను నయం చేస్తుంది. ఎండుద్రాక్షల్లో గట్ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడే శోథ నిరోధక లక్షణాలు ఉంటాయని ఓ పరిశోధనలో తేలింది. ఇది మీ గట్ లోని బ్యాక్టీరియా సమతుల్యతను నియంత్రిస్తుంది.
raisins
ఎండుద్రాక్షలు మీ శరీరంలో ఇనుము స్థాయిలను పెంచి.. ఎముకలను బలంగా చేస్తుంది. రోజుకు 30 నుంచి 40 గ్రాముల ఎండుద్రాక్ష తినడం ఆరోగ్యానికి మంచిది. అంటే రోజుకు 8 నుంచి 10 ఎండుద్రాక్షలు తినొచ్చు. ఏదేమైనా.. ఎండు ద్రాక్షలను మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయి. ఎండుద్రాక్షలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఇతర పోషకాలను శోషించుకోకుండా అడ్డుకుంటుంది.
ఎండుద్రాక్షల వల్ల కలిగే ప్రయోజనాలు
జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది
ఎండుద్రాక్షల్లో కరగని డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. మలవిసర్జన ఈజీగా అయ్యేందుకు సహాయపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, పొత్తి కడుపు నొప్పి, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, అపాన వాయువు మొదలైన ఇతర జీర్ణశయాంతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బరువు పెరగడం
కొంతమంది బరువు ఎక్కువగా ఉంటే.. మరికొంత మంది మరీ సన్నగా పుల్లలా ఉంటారు. ఇలాంటి వాళ్లు బరువు పెరిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వారికి ఎండు ద్రాక్షలు సహాయపడతాయి. అయితే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ సమృద్ధిగా ఉండే ఎండుద్రాక్షలు చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి, ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు సహాయపడతాయి. అలాగే ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.
క్యాన్సర్ తో పోరాడుతాయి
ఎండుద్రాక్షలో యాంటీ కార్సినోజెనిక్ ప్రయోజనాలున్నాయి. ఎండుద్రాక్షల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యం ఉందని కొన్ని అధ్యయనాలు నిర్ధారించాయి. అందుకే వీటిని రోజూ కొన్ని తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటును నియంత్రిస్తుంది
ఎండుద్రాక్షలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్త నాళాలను సడలిస్తుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఎండుద్రాక్షలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇతర సమ్మేళనాలుంటాయి. దీనిలో పాలిఫెనాల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఎండుద్రాక్షలు కణాలకు ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తాయి.