పల్లెల్లో లేదా సాంప్రదాయ పద్ధతుల్లో మాంసాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి డ్రై మటన్ను తయారు చేస్తుంటారు. దీన్ని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
మటన్ (ఎముకలు లేని సన్నని ముక్కలు): 1 కిలో
ఉప్పు: తగినంత పసుపు: 1 టీస్పూన్
కారం లేదా మిరియాల పొడి: రుచికి సరిపడా
తయారీ విధానం:
ముక్కల ఎంపిక: ముందుగా మటన్ను కొవ్వు లేని భాగం చూసి, వీలైనంత సన్నని చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడగాలి. ముక్కలు ఎంత సన్నగా ఉంటే ఎండలో అంత త్వరగా ఆరుతాయి.
మ్యారినేషన్: శుభ్రం చేసిన మటన్ ముక్కలకు తగినంత ఉప్పు, పసుపు, కారం బాగా పట్టించి కొన్ని గంటలు అలాగే నాననివ్వాలి.
ఎండబెట్టడం: ఆ ముక్కలను ఒక శుభ్రమైన తెల్లటి పలుచని గుడ్డపై లేదా పెద్ద పళ్లెంలో ఎండలో పరవాలి. దుమ్ము, దూళి తగలకుండా చూసుకోవాలి. లేదంటే.. సూది, దారంతో వాటిని ఒక దారానికి గుచ్చి మరీ.. ఎండబెట్టుకోవచ్చు. ఈ ముక్కల్లోని తేమ పూర్తిగా ఆవిరైపోయి, రాయిలా గట్టిగా మరే వరకు (సుమారు 3 నుంచి 5 రోజుల పాటు) రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో బాగా ఆరబెట్టాలి. తేమ పూర్తిగా పోయిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లేదా గాజు సీసాలో భద్రపరుచుకుంటే నెలల తరబడి నిల్వ ఉంటుంది. దీన్ని అవసరమైనప్పుడు కూరల్లో వేసుకుని వండుకోవచ్చు.