
మానసిక ఆరోగ్యం బాగుంటేనే మన శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం చాలా మంది స్ట్రెస్ తో బాధపడుతున్నారు. అయితే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కొన్ని రకాల ఆహారాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఒమేగా -3 కొవ్వులు, కూరగాయలతో సహా పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు వంటి కొన్ని ఆహారాలు కార్టిసాల్ అని పిలువబడే ఒత్తిడి హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
విటమిన్ బి, విటమిన్ సి, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్ లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. అనారోగ్యకరమైన ఆహారాలు ఒత్తిడి స్థాయిని విపరీతంగా పెంచుతాయి. ఈ ఒత్తిడిని తగ్గించుకోకపోతే భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో ఎలాంటి ఆహారాలు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
డార్క్ చాక్లెట్స్
డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఆందోళన తగ్గుతుంది. ఈ చాక్లెట్స్ లో ఎపికాటెచిన్, కాటెచిన్ వంటి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 70% కోకో లేదా అంతకంటే ఎక్కువ (ఎక్కువ పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్లను కలిగి ఉన్న) డార్క్ చాక్లెట్ కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుందని కనుగొన్నారు.
కార్భోహైడ్రేట్లు
కార్బోహైడ్రేట్లు తాత్కాలికంగా సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. ఇది మానసిక స్థితిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. సెరోటోనిన్ స్థాయిలు పెరిగిన తరువాత ఒత్తిడితో బాధపడుతున్న వారిలో ఏకాగ్రత, శ్రద్ధ పెరుగుతుందట. కుకీలు, కేకులు, వైట్ పాస్తా, వైట్ బ్రెడ్ తో సహా తెల్ల పిండితో తయారుచేసే ఆహారాలను ఎక్కువగా తీసుకోకండి. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరస్థాయిలను ఆకస్మత్తుగా పెంచడం లేదా తగ్గిస్తాయి.
అవకాడో
అవకాడోలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్.. ఈ ఆవశ్యక ఆమ్లాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయని పేర్కొంది. అంతేకాదు దీనిలో ఫైటోకెమికల్స్, ఫైబర్స్, అవసరమైన పోషకాలు కూడా ఉంటాయి. జనవరి 2013 లో న్యూట్రిషన్ జర్నల్ లో ప్రచురించబడిన ఒక సర్వేలో.. అవకాడోలను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, ఊబకాయం నియంత్రణలో ఉంటాయట.
చేపలు
చేపల్లో ఒత్తిడిని పోగొట్టే ఔషదగుణాలుంటాయి. అంతేకాదు ఈ చేపలు గుండె జబ్బులను నివారించడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు నిరాశను తగ్గించడానికి సహాయపడుతాయి. కొవ్వు చేపలలో ట్యూనా, సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ ఉన్నాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
కాల్షియం
కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. అయితే డిసెంబర్ 2012 లో జర్నల్ న్యూట్రిషన్ రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈ కాల్షియం కూడా నిరాశను తగ్గిస్తుందని వెల్లడించింది. జర్నల్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనంలో.. కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు కండరాలను సడలించడానికి, మానసిక స్థితిని మెరుగుపర్చడానికి సహాయపడతాయని వెల్లడైంది.
గింజలు
గింజల్లో కొవ్వు ఆమ్లాలతో పాటుగా విటమిన్ బి తో పాటుగా ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ విటమిన్ బి ఒత్తిడిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పిస్తా, బాదం, వాల్ నట్స్ ను తినాలని చెబుతున్నారు. ఇవి రక్తపోటును కూడా తగ్గిస్తాయి.