
దీపావళి వేళ అందంగా, మెరిసిపోయే చర్మంతో కనిపించాలని చాలామంది ఫేషియల్, బొటాక్స్, ఫిల్లర్స్ వంటి బ్యూటీ ట్రీట్మెంట్స్ అంటూ పరుగులు పెడతారు. అయితే పండుగకు ఒకటి రెండు రోజుల ముందు వీటిని చేయించుకోవడం వల్ల ఫలితం రాదు సరికదా... వాపు, మచ్చలు వంటి సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే చివరి నిమిషంలో బ్యూటీ ట్రీట్మెంట్స్ చేయించుకునే ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.
చాలా వరకు బ్యూటీ ట్రీట్మెంట్స్ రిజల్స్ కనిపించడానికి 3 నుంచి 7 రోజుల సమయం పడుతుంది. పూర్తి రిజల్ట్ రావడానికి దాదాపు రెండు వారాలు పట్టవచ్చు. ముఖ్యంగా బొటాక్స్, ఫిల్లర్స్ వంటి ట్రీట్మెంట్స్ విషయంలో జాగ్రత్త అవసరం.
ముఖంపై ముడతలను తగ్గించేందుకు బొటాక్స్ ట్రీట్మెంట్ను చాలామంది చేయించుకుంటారు. అయితే ఇది చేయించుకున్న వెంటనే ముఖంలో మార్పులు కనిపించవు. ముఖం కండరాలు పూర్తిగా సర్దుకోవడానికి సుమారు 2 వారాల సమయం పడుతుంది. అందుకే వైద్యులు కూడా ట్రీట్మెంట్ తర్వాత రెండు వారాల రిజల్ట్ చెక్ చేస్తారు.
ఇక హైలురోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ విషయానికి వస్తే.. వీటితో ముఖంలో మార్పులు త్వరగానే కనిపించినప్పటికీ, తొలుత వాపు, సున్నితత్వం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. కొందరిలో వాపు కొన్ని రోజుల పాటు ఉండొచ్చు. గాయాల వల్ల నల్లటి మచ్చలు తగ్గడానికి 2 వారాల వరకు పట్టొచ్చు. స్కిన్ బూస్టర్స్ వంటి ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్తోనూ వెంటనే ఫలితాలు ఆశించకూడదు. సాధారణంగా రెండు సెషన్లుగా ఇచ్చే ఈ చికిత్సల ఫలితాలు కనిపించడానికి 6 నుంచి 8 వారాల సమయం పట్టవచ్చు. అంతేకాదు.. ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకున్న తర్వాత సుమారు రెండు వారాల పాటు ఫేషియల్స్, మసాజ్‌లు, థ్రెడింగ్ వంటివి చేయించుకోవద్దని నిపుణులు చెబుతుంటారు.
దీపావళికి షాపింగ్, ప్రయాణాలు, ఇంట్లో ఏర్పాట్లతో బిజీగా ఉంటారు. ఇలాంటి సమయంలో కొత్తగా బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకుంటే దాని వల్ల వచ్చే వాపు, అసౌకర్యం మరింత ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా ముఖ్యమైన వేడుకలు, ఫంక్షన్లకు ముందు తొలిసారిగా ఫిల్లర్స్ చేయించుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ పనిచేయదు. ఏదైనా ప్రక్రియను ఎంచుకునే ముందు చర్మ పరిస్థితిని చెక్ చేయించుకోవాలి. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు, చికిత్స వల్ల ఎదురయ్యే సమస్యల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
పండుగకు ముందు చర్మం నిర్జీవంగా కనిపించడం, అకస్మాత్తుగా మొటిమలు రావడం, జుట్టు పలుచబడటం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ వైపు వెళ్లాల్సిన పని లేదు. నిద్రలేమి, ఒత్తిడి, పోషకాహార లోపాలు, థైరాయిడ్ సమస్యలు కూడా చర్మంపై ప్రభావం చూపవచ్చు. ముఖంపై ముడతలు, చర్మం సాగిపోవడం వంటి మార్పులకు ఇవి కారణం కావచ్చు. అలాగే శారీరక, మానసిక ఒత్తిడి వల్ల జుట్టు రాలే సమస్య కూడా పెరగవచ్చు.
దీపావళికి ముందు చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుకోవాలంటే కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ప్రతిరోజూ ఉదయం సన్‌స్క్రీన్ రాసుకోవాలి. బయటకు వెళ్లిన ప్రతిసారీ అవసరమైన మేరకు మళ్లీ అప్లై చేయాలి. మీ చర్మతత్వానికి సరిపోయే మైల్డ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. స్కిన్‌కేర్ రొటీన్లో కొత్తగా చాలా ఉత్పత్తులు చేర్చకుండా, అవసరమైతే ఒక యాక్టివ్ ఇంగ్రిడియెంట్ను మాత్రమే చేర్చాలి. తగినంత నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. చర్మ సమస్యలు తీవ్రంగా ఉంటే సొంతంగా ప్రయోగాలు చేయకుండా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.