వంకాయ తింటే గుండె జబ్బుల నుంచి రక్తపోటు వరకు ఎన్ని రోగాలు తగ్గిపోతాయో.. !

First Published | Nov 4, 2022, 10:46 AM IST

వంకాయల్లో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం, కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాదు వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 
 

కూరగాయల్లో వంకాయ రారాజు. వంకాయ ఊదారంగు, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉంటాయి. వంకాయలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో ఫ్లేవనాయిడ్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే పొటాషియం, సోడియం, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. వంకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి. 

గుండె ఆరోగ్యంగా ఉంటుంది

వంకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో పుష్కలంగా ఉండే పొటాషియం, విటమిన్ బి 6 గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. వంకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ధమనులను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
 


అధిక రక్తపోటు తగ్గుతుంది

ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. రక్తపోటు పెరిగితే గుండెపోటు నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పొటాషియం అధికంగా ఉండే వంకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీన్ని తగ్గించుకోవాలి. వంకాయను తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వంకాయలో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం గొప్ప యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అలాగే ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
 

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి

వంకాయలు మధుమేహులకు ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో కార్భోహైడ్రేట్లు తక్కువగా ఉండి.. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇవి మధుమేహుల ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. ఈ వంకాయలు ఆహారం నుంచి గ్లూకోజ్ శోషణను నియంత్రిస్తాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వీటిలో ఫినోలిక్ సమ్మేళనాలు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది.

వంకాయల్లో ఐరన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిని తరచుగా తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు. అంతేకాదు.. వంకాయ బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.

వంకాయలు మెదడు పనితీరును కూడా నియంత్రిస్తాయి. వంకాయలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అంతేకాదు మెదడు పనితీరును వేగవంతం చేయడానికి కూడా సహాయపడతాయి.

Latest Videos

click me!