వేసవి కాలం మొదలైందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలన్నింటిలోనూ వాటర్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు పంపితేనే నీరందే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి విజయవాడ, వైజాగ్, తిరుపతి, కరీంనగర్ వంటి నగరాల్లో కూడా ఉంది. దీనికి ప్రధానంగా వాటర్ లేకపోవడం ఒక సమస్య అయితే.. ఉన్న నీటిని పొదుపుగా వాడకపోవడం మరో ముఖ్య కారణం.
ప్రభుత్వాలు సరఫరా చేయాల్సిన నీరు సంగతి అటుంచితే.. పర్సనల్ గా ఒక్కో వ్యక్తి రోజుకు ఎంత నీరు ఉపయోగిస్తారో మీకు తెలుసా? తాగడానికి 5 లీటర్లు, వంట కోసం 5 లీటర్లు, రెండు పూటలా స్నానానికి 60 లీటర్లు, బట్టలు ఉతకడానికి 20 లీటర్లు ఇలా ఇతర అవసరాలు కలిపి మొత్తంగా సుమారు 130 లీటర్ల వరకు నీరు అవసరం. ప్రభుత్వాలు కూడా ఇలాంటి గణాంకాల ద్వారానే నీటిని సరఫరా చేస్తుంటాయి. అయితే ఆ నీటిని సక్రమంగా ఉపయోగిస్తున్నామా? అంటే చాలా మంది నీటిని వేస్ట్ గా మట్టిపాలు చేస్తుంటారు.
వేసవిలో నీటిని వృథా చేయకుండా పొదుపుగా ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం వేసవి కాబట్టి ఇంట్లో పేరుకుపోయిన మురికి పాత్రలను కడిగే విధానాన్ని మార్చాలి. నీటి కుళాయిని తెరిచి కడగకుండా బకెట్ లాంటి పెద్ద పాత్రలో నీటిని నింపి వాటితో కడిగితే ఎక్కువ నీరు వేస్ట్ కాకుండా ఉంటుంది.
ఉదయం బ్రష్ చేసేటప్పుడు, ముఖం కడుక్కొనేటప్పుడు కుళాయి తెరిచి నీటిని వృథా చేయకుండా ఒక చిన్న బకెట్‌లో నీటిని నింపి ఉపయోగించండి. తక్కువ నీటితోనే మీరు ఫ్రెష్ అవుతారు.
వాహనాలు శుభ్రం చేయడానికి టాప్ పైపుతో నీటిని చిమ్మి శుభ్రం చేసే బదులు బకెట్ నీటితో తడి గుడ్డ పెట్టి శుభ్రంగా తుడవచ్చు. ముఖ్యంగా వేసవిలో ఇలా చేస్తేనే నీటిని పొదుపు చేయగలం.
ఇంతకుముందు స్నానం చేసేటప్పుడు షవర్‌లో గంటల తరబడి స్నానం చేసి ఉండవచ్చు. కానీ వేసవి కాబట్టి బకెట్ నీటితోనే సర్దుకోవాలి. అవసరమైతే ఆ బకెట్ నీటిలో కాస్త డెటాల్, తులసి ఆకులు, వేప ఆకులు లాంటివి వేస్తే మీ శరీరంపై ఉండే క్రిములు నాశనమవుతాయి.
వేసవి వచ్చేసింది కాబట్టి ఇంట్లో నీటి లీకేజీలు ఉంటే ఆలస్యం చేయకుండా సరిచేయించండి. ట్యాప్ ల నుంచి చుక్క చుక్క నీరు పడుతుంటే రాకుండా ఆపే చర్యలు తీసుకోండి.
ప్రతిరోజు బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్ ఉపయోగిస్తే ఎక్కువ నీరు ఖర్చవుతుంది. ఒకే రోజు బట్టలు ఉతకడం వల్ల గణనీయంగా నీటి ఖర్చును తగ్గించవచ్చు. మిగిలిన నీటిని టాయిలెట్‌లో కూడా ఉపయోగించవచ్చు.
వేసవి కాలంలో వెస్ట్రన్ టాయిలెట్ కంటే ఇండియన్ టాయిలెట్ వాడితే తక్కువ నీరు సరిపోతుంది.
నీటి కుళాయిలను ఎప్పుడూ సరిగ్గా ఆఫ్ చేయండి.
తినేటప్పుడు చేతులు కడుక్కోవడానికి బకెట్‌లోని నీటిని మగ్ ఉపయోగించి వాడండి.