
విటమిన్ సి మన శరీరానికి కావాల్సిన ఒక ముఖ్యమైన పోషకం. ఇది నీటిలో త్వరగా కరిగిపోతుంది. దీంతో ఈ విటమిన్ సి నిల్వలు శరీరంలో ఉండవు. అందుకే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను, సప్లిమెంట్లను ప్రతిరోజూ తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.
ఈ విటమిన్ సి గాయాలను తొందరగా మాన్పించడానికి, ఇన్ఫెక్షన్లను నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే మృదులాస్థి, రక్తం, నాడీ వ్యవస్థ, ఎముకలకు సంబంధించి బంధన కణజాలం ముఖ్యమైన భాగమైన కొల్లాజెన్ ను తయారుచేయడానికి కూడా సహయపడుతుంది. విటమిన్ సి హార్మోన్ల తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
ఒక వయోజన వ్యక్తి రోజుకు 90 మి.గ్రా విటమిన్ సి ను తీసుకుంటే.. స్త్రీ ఈ విటమిన్ సి ని 75. మి.గ్రా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే స్మోకింగ్ చేసేవారు ఈ స్థాయిల కంటే ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ని తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీరి శరీరంలో విటమిన్ సి స్థాయిలు తక్కువగా ఉంటాయి. అయితే కొంతమందికి విటమిన్ సిపై ఎన్నో అపోహలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణ జలుబును తగ్గిస్తుంది
విటమిన్ సి సాధారణ జలుబును తగ్గిస్తుందనేది పెద్ద అపోహ. కానీ సాధారణ జనాలకు ఈ విషయం తెలియక కరోనా టైంలో విటమిన్ సి సప్లిమెంట్లను విపరీతంగా ఉపయోగించారు. అది కూడా వైద్యులను సంప్రదించకుండా.
నిజానికి విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ నే పెంచెతుంది. కానీ జలుబును మాత్రం తగ్గించదు. దీనికి ఆధారాలు కూడా లేవని నిపుణులు చెబుతున్నారు.
ఆరెంజ్ లోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది
చాలా మంది పుల్లని పండ్లలోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. ఇది పాక్షికంగా నిజమే అయినప్పటికీ.. పూర్తిగా వీటిలోనే విటమిన్ సి ఉంటుందనేది మాత్రం వాస్తవం కాదు. నిమ్మకాయ, ఆరెంజ్ వంటి పుల్లని పండ్లలోనే కాకుండా ఇతర ఆహారాల్లో కూడా విటమిన్ సి ఉంటుంది. సిట్రస్ పండ్లతో పాటుగా విటమిన్ సి ఉండే కూరగాయలు, పండ్లను కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ సి ఎంత ఎక్కువుంటే రోగ నిరోధక వ్యవస్థ అంత బలంగా ఉంటుంది
నిజానికి దీనిలో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో ఉండే ప్రతి విటమిన్ నిర్ధిష్ట మొత్తంలోనే ఉండాలి. అంతకు మించితే ఇవి విషంగా మారి శరీరానికి హాని చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సప్లిమెంట్లను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటమే కాకుండా.. విరేచనాలు కూడా అవుతాయి. ఒకరకంగా చెప్పాలంటే మన రక్తంలో ఇనుము ఎక్కువగా ఉన్నప్పుడు సంభవించే హీమోక్రోమాటోటిస్ అనే పరిస్థితికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకే విటమిన్ సి అవసరం..
విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమయే కాదు.. శరీరానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటుగా నోర్ఫైన్ఫ్రైన్, డోపామైన్ సంశ్లేషనకు సహాయపడుతుంది. మానసిక పరిస్థితిని నియంత్రించేందుకు కూడా విటమిన్ సి ఉపయోగపడుతుంది. ఇది ఇనుము లోపాన్ని కూడా పోగొడుతుంది.
ఆరోగ్యంగా ఉన్నాం.. విటమిన్ సి అవసరం లేదు..
ఆరోగ్యంగా ఉన్నామని విటమిన్ సి అవసరం లేదు అనుకునే వారు చాలా మందే ఉన్నారు. నిజానికి ఒక వ్యాధి మీకు సోకినా అది అంతతొందరగా బయటపడదు. రోగం ముదిరిన తర్వాతే రోగ లక్షణాలు కనిస్తాయి. ఇకపోతే శరీరంలో విటమిన్ల అవసరం ఎంతో ఉంది. వీటితోనే అవయవాల పనితీరు బాగుంటుంది. అయితే మీ శరీరంలో విటమిన్ సి లోపం ఉందా? లేదా అనేది మాత్రం వైద్య పరీక్షతో మాత్రమే తెలుస్తుంది.