Chocolate History: చాక్లెట్ ఎలా పుట్టింది.? మొద‌ట్లో చాక్లెట్ ఏ రూపంలో ల‌భించేదో తెలుసా.?

Published : May 26, 2026, 12:30 PM IST

Chocolate History: చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే వాటిలో చాక్లెట్ ఒక‌టి. అయితే వేల ఏళ్ల క్రితం చాక్లెట్ ఇప్పటిలా తీపిగా ఉండేది కాదు. దాని రూపం, రుచి, వినియోగ విధానం కూడా పూర్తిగా భిన్నంగా ఉండేది. అసలు చాక్లెట్ చరిత్ర ఎక్కడ మొద‌లైందంటే 

PREV
15
4 వేల ఏళ్ల క్రితం ప్రారంభమైన చాక్లెట్ కథ

చాక్లెట్ చరిత్ర దాదాపు 4,000 సంవత్సరాల క్రితం మధ్య అమెరికా ప్రాంతంలో ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం మెక్సికో, గ్వాటెమాలా, హోండురాస్ వంటి దేశాలు ఉన్న ప్రాంతాన్ని అప్పట్లో మెసోఅమెరికా అని పిలిచేవారు. ఈ ప్రాంతంలో నివసించిన ప్రాచీన ఒల్మెక్ నాగరికత ప్రజలే కోకో మొక్కలను మొదట గుర్తించి వాటిని ఉపయోగించడం ప్రారంభించినట్లు భావిస్తున్నారు. కోకో గింజల ప్రత్యేకతను గుర్తించిన తొలి నాగరికతగా ఒల్మెక్‌లను చరిత్ర పేర్కొంటుంది.

25
మొదట చాక్లెట్‌ను తినేవారు కాదు..

ఇప్పటి మిల్క్ చాక్లెట్ బార్‌లతో పోలిస్తే ప్రాచీన చాక్లెట్ పూర్తిగా భిన్నంగా ఉండేది. అప్పటి ప్రజలు కోకో గింజలను నూరి పేస్ట్‌లా తయారు చేసేవారు. ఆ తర్వాత దానిలో నీరు, మిరపకాయలు, స్థానిక సుగంధ ద్రవ్యాలు కలిపి ఒక ప్రత్యేక పానీయాన్ని తయారు చేసేవారు. ఈ పానీయం తీపిగా కాకుండా చేదుగా, కొద్దిగా కారంగా ఉండేది. ప్రస్తుతం చాక్లెట్‌లో ఉండే చక్కెర, పాల పదార్థాలు, క్రీమీ టెక్స్చర్ వంటివి అప్పట్లో ఉండేవి కావు. అయినప్పటికీ ఆ పానీయాన్ని ఆరోగ్యకరమైనదిగా, శక్తినిచ్చేదిగా భావించేవారు.

35
మాయన్, అజ్టెక్ నాగరికతల్లో చాక్లెట్‌కు ప్రత్యేక స్థానం

ఒల్మెక్‌ల తర్వాత వచ్చిన మాయన్, అజ్టెక్ నాగరికతలు కూడా కోకో పానీయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాయి. వారు దీనిని సాధారణ డ్రింక్‌గా కాకుండా పవిత్రమైనదిగా భావించేవారు. చాక్లెట్‌ను "దేవతల పానీయం"గా పిలుస్తూ పూజా కార్యక్రమాలు, ముఖ్యమైన వేడుకల్లో వినియోగించేవారు. రాజులు, యోధులు, ఉన్నత వర్గాల వారు ఎక్కువగా ఈ పానీయాన్ని సేవించేవారని చరిత్ర చెబుతోంది.

45
కోకో గింజలే కరెన్సీగా మారాయి

అజ్టెక్ సామ్రాజ్య కాలంలో కోకో గింజలకు అపారమైన విలువ ఏర్పడింది. వాటిని కేవలం డ్రింక్‌ తయారీకి మాత్రమే కాకుండా డబ్బుల మాదిరిగా కూడా ఉపయోగించారు. ఆహారం కొనుగోలు చేయడం, వస్తువుల మార్పిడి, సేవలకు చెల్లింపులు చేయడం వంటి అవసరాలకు కోకో గింజలను వినియోగించేవారు. కోకో పంట పండించడం కష్టతరమైన పని కావడం, గింజలకు అధిక డిమాండ్ ఉండటంతో అవి విలువైన ఆస్తిగా మారాయి.

55
యూరప్‌కు చేరిన తర్వాత చాక్లెట్ రూపమే మారిపోయింది

16వ శతాబ్దంలో స్పెయిన్‌కు చెందిన అన్వేషకుడు హెర్నాన్ కోర్టెస్ అజ్టెక్ సామ్రాజ్యాన్ని సందర్శించినప్పుడు కోకో పానీయాన్ని పరిచయం చేసుకున్నాడు. అనంతరం దానిని యూరప్‌కు తీసుకెళ్లాడు. మొదట యూరోపియన్లు ఈ చేదు పానీయాన్ని అంతగా ఇష్టపడలేదు. తర్వాత దానిలో చక్కెర, వెనిల్లా, దాల్చిన చెక్క వంటి పదార్థాలు కలపడంతో రుచి మారిపోయింది. దీంతో చాక్లెట్ యూరప్ రాజవంశాలు, ధనిక కుటుంబాల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది.

1828లో డచ్ రసాయన శాస్త్రవేత్త కోఎన్‌రాడ్ వాన్ హౌటెన్ కోకో ప్రెస్ యంత్రాన్ని కనిపెట్టడం చాక్లెట్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పున‌కు దారితీసింది. ఈ యంత్రంతో కోకో బటర్‌ను వేరు చేయడం సులభమై, ఘనరూపంలో తినే చాక్లెట్ తయారీ సాధ్యమైంది. అప్పటి నుంచి ఆధునిక చాక్లెట్ బార్‌లు, క్యాండీలు, డెజర్ట్‌ల తయారీ వేగంగా విస్తరించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇష్టపడే చాక్లెట్ వెనుక వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, సాంకేతిక అభివృద్ధి దాగి ఉందని చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories