Chapati Dough: చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెట్టొచ్చా? పెడితే ఎన్ని రోజుల్లోపు వాడాలి?

Published : Sep 05, 2026, 04:09 PM IST

Chapati Dough: రోజూ చపాతీలు చేసుకునేవారికి ప్రతిసారీ పిండి కలపడం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే చాలామంది ఒకేసారి ఎక్కువ పిండి కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకుంటారు. కానీ చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెట్టడం మంచిదేనా? పెడితే ఎన్ని రోజుల్లో వాడాలో ఇక్కడ చూద్దాం.

PREV
15
చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెట్టొచ్చా?

ఇంట్లో రోజూ చపాతీలు చేసుకునే చాలామంది ఒకేసారి ఎక్కువ పిండి కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రతిరోజూ పిండి కలపాల్సిన అవసరం ఉండదు, టైం కూడా సేవ్ అవుతుంది. కానీ చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెట్టి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఒకవేళ పెట్టినా ఎన్ని రోజుల్లోపు ఉపయోగించాలి? పిండిని ఫ్రిజ్ లో పెట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిండి పాడైందని ఎలా తెలుసుకోవాలి? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

25
చపాతీ పిండిని నిల్వ చేయాలంటే?

ఆరోగ్య నిపుణుల ప్రకారం చపాతీ పిండిని ఎప్పటికప్పుడు కలిపి చేసుకొని తినడం మంచిది. ఒకవేళ చపాతీ పిండిని నిల్వ చేయాలనుకుంటే ముందుగా పిండిని బాగా కలిపి, అవసరమైనంత నూనె రాసి, శుభ్రమైన గాలి చొరబడని డబ్బాలో పెట్టాలి. డబ్బాను బిగుతుగా మూసి ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల పిండి ఎండిపోకుండా ఉంటుంది. ఫ్రిజ్ ఉష్ణోగ్రత సుమారు 4°C లేదా అంతకంటే తక్కువగా ఉండటం మంచిది. పిండిని ఫ్రిజ్‌లో పెట్టే ముందు ఎక్కువసేపు వంటగదిలో లేదా బయట ఉంచకూడదు.

35
ఎన్ని రోజుల్లో వాడాలి?

కలిపిన చపాతీ పిండిని సాధ్యమైనంత వరకు 1-2 రోజుల్లో ఉపయోగించడం మంచిది. కొందరు దీన్ని మూడు, నాలుగు రోజుల వరకు ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ పిండి రుచి, వాసన, రంగు, నాణ్యత మారే అవకాశం ఉండటంతో ఎక్కువ రోజులు నిల్వ చేయడం మంచిది కాదు. ముఖ్యంగా పిండిలో పెరుగు, పాలు, ఇతర పదార్థాలు కలిపి ఉంటే నిల్వ విషయంలో మరింత జాగ్రత్త అవసరం.

45
పిండి ఇలా మారిపోతే?

ఫ్రిజ్‌లో పెట్టిన పిండిని మళ్లీ ఉపయోగించే ముందు దాని పరిస్థితిని తప్పకుండా గమనించాలి. పిండి పుల్లటి లేదా వింత వాసన వస్తే వాడకపోవడం మంచిది. అలాగే పిండిపై నల్లటి, ఆకుపచ్చటి లేదా తెల్లటి మచ్చలు, బూజు కనిపించినా, పిండి రంగు అసాధారణంగా మారినా, చాలా జిగటగా లేదా వింతగా మారినా వెంటనే పారేయాలి.

చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు మొత్తం పిండిని ఒకేసారి బయటకు తీసి మళ్లీ మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదు. మీకు అవసరమైనంత పిండిని మాత్రమే తీసుకుని మిగిలినదాన్ని వెంటనే తిరిగి ఫ్రిజ్‌లో పెట్టాలి. వీలైతే పిండిని ముందుగానే చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి డబ్బాలో పెట్టుకోవడం మంచిది.

55
చపాతీలు చేసేముందు..

ఫ్రిజ్‌లో పెట్టిన చపాతీ పిండి చల్లగా, కొంచెం గట్టిగా అనిపించడం సహజమే. చపాతీలు చేయడానికి 15–20 నిమిషాల ముందు అవసరమైన పిండిని బయటకు తీసి కొద్దిసేపు ఉంచితే చపాతీలు చేయడం సులభంగా ఉంటుంది. పిండిని ఒకసారి బాగా కలిపి, అవసరమైతే కొద్దిగా నీరు లేదా నూనె రాసి మెత్తగా చేసుకోవచ్చు.

చపాతీ పిండిని ఎక్కువ రోజులు నిల్వ చేయాల్సి వస్తే ఫ్రిజ్ కంటే ఫ్రీజర్ మంచి ప్రత్యామ్నాయం. అయితే ఫ్రీజ్ చేయడం వల్ల నాణ్యతలో కొంత మార్పు రావచ్చు. కాబట్టి పిండిని అవసరమైనంత మాత్రమే కలిపి, వీలైనంత త్వరగా ఉపయోగించడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories