Summer Tour : నడి వేసవిలోనూ 10 డిగ్రీల టెంపరేచర్స్.. ఇప్పుడు టూర్ కి వెళ్లినా స్వెటర్ వేయాల్సిందే..!

Published : May 12, 2026, 04:50 PM IST

Top 5 Cool Hill Stations : ప్రస్తుతం ఇండియాలో ఎండలు మండిపోతున్నాయి. అయితే కొన్నిచోట్ల ఇప్పుడు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి… అలాంటి టాప్ 5 టూరిస్ట్ ప్రాంతాలేవో తెలుసా..?

PREV
16
ఈ సమ్మర్ లో తప్పకుండా చూడాల్సిన ప్రాంతాలివే..

Summer Tour : ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి... రాబోయే రోజుల్లో వీటి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పడు కాస్త నయం... మధ్యాహ్నం ఎండలు మండిపోయినా ఉదయం, సాయంత్రం చల్లగానే ఉంటోంది. కానీ ఇకపై అలా కాదట... మే 14 నుండి ఉదయం, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 30 డిగ్రీలకు పైనే నమోదయ్యే అవకాశాలుంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎండలు మరింత ముదురుతున్న సమయంలో ఇంట్లో ఉండటం నరకమే.. వేసవి సెలవుల్లో ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బంది పడతారు. బయటకు వెళదామంటే ఎండలు, వడగాలుల భయం... అందుకే ఉదయం, సాయంత్రం వెళ్లేవారు. ఇప్పుడు ఈ అవకాశం కూడా లేకుండా పోతోంది. అందుకే చాలామంది మే లోనే అంటే ఫీక్స్ ఎండల్లోనే చల్లని ప్రదేశాలకు టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఇలా మీరు కూడా ఫ్యామిలీతో టూర్ కి వెళదామని అనుకుంటున్నారా..? అయితే తక్కువ ఖర్చుతో ఇండియాలోనే చుట్టివచ్చే చల్లని ప్రదేశాలేవో తెలుసుకుందాం.

26
1. కుఫ్రి (Kufri) - హిమాచల్ ప్రదేశ్

వేసవి కాలంలో భానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి ఉత్తర భారతదేశంలోని హిల్ స్టేషన్లు ఉత్తమమైన ఎంపిక. ఇలాంటి అనేక టూరిస్ట్ స్పాట్స్ హిమాచల్ ప్రదేశ్ లో అనేకం ఉన్నాయి... అలాంటిదే కుఫ్రి.

సిమ్లాకు అతి సమీపంలో ఉండే ఈ చిన్న గ్రామం వేసవిలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వేసవిలోనూ ఇక్కడ ఉష్ణోగ్రతలు 10°C నుండి 20°C మధ్య ఉంటాయి. పచ్చని లోయలు, మంచుతో నిండిన హిమాలయ పర్వత శిఖరాల వీక్షణలు కనువిందు చేస్తాయి. కుఫ్రి ఫన్ వరల్డ్, గినియెట్ పార్క్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

ప్రయాణం : హైదరాబాద్ లేదా విజయవాడ నుండి ముందు ఢిల్లీ లేదా చండీగఢ్‌కు వెళ్లాలి. అక్కడి నుండి బస్సు లేదా టాక్సీలో కుఫ్రి వెళ్లవచ్చు.

బడ్జెట్: 5 రోజుల పర్యటనకు ఒక వ్యక్తికి సుమారుగా రూ.15,000 - రూ. 20,000 అవుతుంది. అంటే ఓ చిన్న ఫ్యామిలీకి రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది.

36
2. నైనిటాల్ (Nainital) - ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ లోని ఈ ప్రాంతాన్ని "సరస్సుల నగరం" అని పిలుస్తారు. హనీమూన్ జంటలకు ఇది స్వర్గధామం... అలాగే కుటుంబంతో కలిసి సరదాగా గడపొచ్చు. ముఖ్యంగా నైని సరస్సులో బోటింగ్ చేయడం, మల్ రోడ్‌లో షాపింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. స్నో వ్యూ పాయింట్ నుండి హిమాలయాలను చూడవచ్చు.

ప్రయాణం : ఢిల్లీ నుండి కత్గోడం వరకు రైలులో వెళ్లి, అక్కడి నుండి టాక్సీలో చేరుకోవచ్చు. బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.

బడ్జెట్ : 4-5 రోజుల పర్యటనకు ఒక వ్యక్తికి రూ.18,000 - రూ.22,000 వరకు ఖర్చవుతుంది.

46
3. మనాలి (Manali) - హిమాచల్ ప్రదేశ్

మంచుతో కప్పబడిన పర్వతాల మధ్యలో ఉండే అందమైన నగరం మనాలి... ఇది సాహస ప్రియులకు, ప్రకృతి ప్రేమికులకు మొదటి ఛాయిస్. రోహ్‌తంగ్ పాస్ (Rohtang Pass) వద్ద వేసవిలో కూడా మంచును ఆస్వాదించవచ్చు. సోలాంగ్ వ్యాలీలో పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ వంటి సాహస క్రీడలు చేయవచ్చు. హిడింబా దేవి ఆలయం ఇక్కడ ప్రత్యేకం.

ప్రయాణం : చండీగఢ్ లేదా ఢిల్లీ నుండి వోల్వో బస్సులలో ప్రయాణించడం ఉత్తమం.

బడ్జెట్ : 6 రోజుల ట్రిప్‌కు ఒక వ్యక్తికి సుమారు రూ.20,000-రూ.25,000 అవసరం అవుతుంది.

56
4. ముస్సోరి (Mussoorie) - ఉత్తరాఖండ్

ఈ ప్రాంతాన్ని "కొండల రాణి" (Queen of Hills) అని పిలుస్తారు. కెంప్టీ ఫాల్స్ (Kempty Falls) వద్ద జలపాత స్నానాలు, గన్ హిల్ పాయింట్ నుండి సూర్యాస్తమయం చూడటం అద్భుతంగా ఉంటుంది. వేసవిలో ఇక్కడి చల్లని గాలులు శరీరాన్ని పులకింపజేస్తాయి.

ప్రయాణం : డెహ్రాడూన్ వరకు రైలు లేదా విమానంలో వెళ్లి అక్కడి నుండి 1.5 గంటల ప్రయాణంతో ముస్సోరి చేరుకోవచ్చు.

బడ్జెట్ : 4 రోజుల పర్యటనకు ఒక వ్యక్తికి రూ.15,000 -రూ.18,000 వరకు ఖర్చవుతుంది.

66
5. లడక్ (Ladakh) - జమ్మూ కాశ్మీర్

నిజమైన సాహస యాత్ర చేయాలనుకునే వారికి లడక్ ఒక కలల ప్రదేశం. వేసవిలో అదీ మే నుండి సెప్టెంబర్ వరకు మాత్రమే ఇక్కడికి వెళ్లడం సాధ్యమవుతుంది. ప్యాంగాంగ్ సరస్సు (Pangong Lake), నుబ్రా వ్యాలీ, అత్యంత ఎత్తైన రహదారులు మిమ్మల్ని వేరే లోకానికి తీసుకెళ్తాయి. అందుకే చాలామంది బైక్స్, సొంత వాహనాల్లో ఇక్కడికి సాహసయాత్ర చేస్తుంటారు.

ప్రయాణం : నేరుగా లేహ్ (Leh) కు విమానంలో వెళ్లడం సులభం లేదంటే మనాలి నుండి రోడ్డు మార్గంలో సాహసయాత్ర చేయవచ్చు.

బడ్జెట్ : లడక్ పర్యటన కాస్త ఖరీదైనది. 7-8 రోజుల ట్రిప్‌కు ఒక వ్యక్తికి సుమారు రూ.35000-రూ.50,000 (ఫ్లైట్ టికెట్లతో కలిపి) వరకు ఖర్చవుతుంది.

ముఖ్య గమనిక :

ముందస్తు బుకింగ్: వేసవిలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోటళ్లు, టికెట్లు కనీసం 2 నెలల ముందే బుక్ చేసుకోవడం మంచిది.

దుస్తులు: ఇవన్నీ చల్లని ప్రాంతాలు కాబట్టి, వేసవిలో వెళ్లినా కొన్ని స్వెటర్లు లేదా జాకెట్లు వెంట ఉంచుకోవడం అవసరం.

ఆరోగ్యం: లడక్ వంటి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లేటప్పుడు 'ఎత్తు వల్ల వచ్చే అస్వస్థత' (Altitude Sickness) గురించి జాగ్రత్తగా ఉండాలి.

మీరు బడ్జెట్ ప్రయాణం చేయాలనుకుంటే రైలు ప్రయాణాన్ని, గ్రూపుగా వెళ్లడాన్ని ఎంచుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories