Mobile Phone:స్మార్ట్‌ఫోన్ అందరి జీవితాల్లో భాగమైపోయింది. ఉదయం నుంచి రాత్రివరకు చాలామంది ఫోన్‌లో ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. ఈ అలవాటు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా? ముఖ్యంగా తల వంచి ఫోన్ చూసేవారికి ఈ సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఫోన్ వాడుతున్నారు. అయితే తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడపై ఎంత ఒత్తిడి పడుతుందో చాలామందికి తెలియదు. సాధారణంగా మన మెడలో ఉన్న ఎముకల నిర్మాణం మన తల బరువును సపోర్ట్ చేస్తుంది.
మన తల సుమారు 4 నుంచి 5 కిలోల బరువు ఉంటుంది. సరిగ్గా నిటారుగా ఉన్నప్పుడు ఈ బరువు మెడపై సమానంగా పడుతుంది. కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. కానీ మనం ఫోన్ చూడటానికి తలను ముందుకు వంచినప్పుడు పరిస్థితి మారిపోతుంది.
25
25 కేజీల వరకు..
తల కొంచెం వంగితేనే మెడపై పడే ఒత్తిడి పెరుగుతుంది. సుమారు 15 డిగ్రీలు వంగితే మెడపై 10-12 కిలోల బరువు పడుతుంది. అదే 30 డిగ్రీలు వంగితే అది 18 కిలోలకు పెరుగుతుంది. మరీ ఎక్కువగా, అంటే 45 నుంచి 60 డిగ్రీలు వంచితే మెడపై సుమారు 25 కిలోల వరకు ఒత్తిడి పడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని సాధారణంగా “టెక్స్ట్ నెక్” అని కూడా అంటారు. ఇది ఒక కొత్త తరహా సమస్యగా మారుతోంది. రోజుకు గంటల తరబడి ఫోన్ చూస్తూ ఉండటం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
35
ఏ సమస్యలు వస్తాయంటే?
మెడపై ఎక్కువ ఒత్తిడి పడితే ఫస్ట్ మెడ నొప్పి వస్తుంది. అది తేలికగా మొదలై దీర్ఘకాలంలో తీవ్రమవుతుంది. తర్వాత భుజాల నొప్పి, వెన్ను నొప్పి కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో తలనొప్పి, చేతుల్లో నొప్పి అనిపించవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే మెడలో డిస్క్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
అంతేకాదు ఈ తలవంచి ఫోన్ చూసే అలవాటు వల్ల మన శరీర భంగిమ(posture) కూడా చెడిపోతుంది. నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు కూడా తల ముందుకు వంగినట్టే ఉంటుంది. ఇది మొత్తం శరీరానికి హానికరం. అయితే ఈ సమస్యను నివారించడం అంత కష్టమేమి కాదు. కొన్ని చిన్న మార్పులు చేస్తే చాలా ప్రయోజనాలు పొందవచ్చు.
55
ఏం చేయాలంటే?
ఫోన్‌ను కిందికి వంగి చూసే బదులు కళ్ల స్థాయికి దగ్గరగా ఎత్తి పట్టుకోవాలి. ఇలా చేస్తే తలను వంచాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎక్కువ సేపు ఒకే పొజిషన్‌లో ఉండకూడదు. ప్రతి 20-30 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలి. మెడకు సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది. తలను నెమ్మదిగా ఎడమ, కుడి వైపుకు తిప్పడం, పైకి కిందికి కదిలించడం వంటివి చేయవచ్చు. ఇవి మెడ కండరాలను రిలాక్స్ చేస్తాయి.
అలాగే నిద్రపోయేటప్పుడు సరైన దిండు ఉపయోగించడం కూడా ముఖ్యమే. చాలా ఎత్తైన లేదా చాలా తక్కువ దిండు వాడితే మెడపై ఒత్తిడి పెరుగుతుంది. ఫోన్ వినియోగాన్ని తగ్గించడం కూడా ఒక మంచి పరిష్కారం. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించడం, మిగతా సమయాల్లో దూరంగా పెట్టడం ఆరోగ్యానికి మంచిది.