జీవితాన్ని క్లిష్టతరం చేసుకునే మార్గాలు
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. జీవితంలో అన్నీ కష్టాలే ఉండవు. అతిగా ఆలోచించడం, అనవసరమైన చింతలు, కొన్ని అలవాట్లు జీవితాన్ని క్లిష్టతరం చేస్తాయి. ఈ ఆలోచన ధోరణిని గుర్తించి, మార్చుకోవడం ద్వారా సంతృప్తికరమైన, సమతుల్య జీవితాన్ని గడపడంపై దృష్టి పెట్టవచ్చు.
1. అతిగా ఆలోచించడం
మనం జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. కొన్ని విషయాల్లో నిర్ణయం వెంటనే జరగాలి. అదేపనిగా నాన్చడం, సందేహించడం.. చేస్తూ ఉంటే మానసిక అలసట ఎక్కువ అవుతుంది. చర్య తీసుకోవడంలో జాప్యం ఏర్పడి ఫలితాలు అందకుండా పోతాయి మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఆ అలవాటు అలాగే కొనసాగితే ఏ నిర్ణయమూ తీసుకోలేని అసమర్థుడిగా మిగిలిపోతాం.
2. ఇతరుల ఆమోదం కోరడం
ఒక పని చేసే ముందు నలుగురి అభిప్రాయం కోరడం తప్పేం కాదు. కానీ ప్రతి చిన్న విషయానికి వాళ్ల సలహా తీసుకోవడం, అందరికీ నచ్చాలనుకోవడం అవివేకం. చేసే ప్రతి పనిలో ఇలా చేస్తే ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించడం.. వ్యక్తిగత ఆనందాన్ని హరించివేస్తుంది. ఇతరుల గురించి ఆలోచించడం మానేసి, సొంత ఆనందాలను వెతుక్కుంటూ ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
3. పదేపదే గతం తలచుకోవడం
జరిగిగిపోయింది తిరిగి రాదు. జరిగినదానిని ఎవరూ తిరిగి మార్చలేరు. వైఫల్యాలను పదేపదే తలచుకోవడం, చెడు జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం.. వర్తమానాన్ని నరకం చేస్తుంది. దైనందిన జీవితంలో అనవసరమైన భారం పెరుగుతుంది. ఇది అవకాశాలకు ఆటంకంగా నిలుస్తుంది. అనుభవాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకోకుండా నిరోధిస్తుంది. గతాన్ని వదులుకొని, మనల్ని మనం క్షమించుకోవడం ద్వారానే అభివృద్ధి పథంలో ముందుకు సాగగలుగుతాం.
4. మార్పును నిరోధించడం
కొందరు మార్పును ఇష్టపడరు. కంఫర్ట్ జోన్ దాటి బయటికి రారు. కానీ జీవితంలో మార్పులకు సిద్ధపడకపోతే ముందుకు వెళ్లలేం. గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే తన కంఫర్ట్ జోన్ ని బద్దలు కొట్టుకొని బయటకి రావాల్సిందే. భయపడి కొత్త నిర్ణయాలు తీసుకోకపోతే, సౌకర్యాలు వదిలి బయటికి రాకపోతే ఎన్నో అవకాశాలు కోల్పోతాం. మార్పును ఓపెన్ మైండ్‌తో స్వాగతించడం వలన జీవితం సులభతరం అవుతుంది. వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమవుతుంది.