భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయినప్పుడు ఆచార్య చాణక్యుడు ప్రజల్లో దేశభక్తిని రగిలించి, దేశం పట్ల వారి బాధ్యతలను గుర్తు చేశారు. అనేక గ్రంథాలు రాసి ప్రజలు సక్రమంగా జీవించడం ఎలాగో నేర్పించారు. జీవితాన్ని ఎలా గడపాలో అనేక సూత్రాలను చాణక్య నీతి శాస్త్రంలో ఆయన చెప్పారు. ఏడుగురు వ్యక్తులు నిద్రిస్తుంటే వెంటనే లేపాలని చాణక్య నీతిలోని ఒక శ్లోకంలో చెప్పారు. ఆ ఏడుగురు ఎవరో తెలుసుకుందాం.
చాణక్య నీతి శ్లోకం
విద్యార్థి సేవకః పాన్థః క్షుధార్తో భయకాతరః।
భండారి ప్రతిహారి చ సప్త సుప్తాన్ ప్రబోధయేత్॥
దీనర్థం ఏంటంటే.. విద్యార్థి, సేవకుడు, ప్రయాణికుడు, ఆకలితో ఉన్నవాడు, భయపడుతున్నవాడు, వంటవాడు, కాపలాదారుడు, ఈ ఏడుగురు నిద్రిస్తుంటే వెంటనే లేపాలి.
విద్యార్థులు ఎక్కువసేపు నిద్రపోకూడదు
చాణక్య నీతి ప్రకారం విద్యార్థుల ఏకైక లక్ష్యం చదువుకోవడం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత విద్యార్థులపై ఉంటుంది. అందువల్ల విద్యార్థులు చదువుకునే సమయంలో నిద్రపోకూడదు. అదే అతనికి మంచిది.
ప్రయాణికుడిని నిద్ర నుండి లేపాలి
బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు చాలాసార్లు ప్రయాణికులు అలసిపోయి నిద్రపోతారు. లేదా కారుల్లో ప్రయాణించేటప్పుడు పక్కకు ఆపి అదే పనిగా నిద్రపోతారు. అలాంటి వారిని వెంటనే నిద్ర లేపకపోతే సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేరు. అలా చేయడం ద్వారా మనం అతనికి సహాయం చేసినట్లే అవుతుంది.
ఉద్యోగి డ్యూటీలో నిద్రపోకూడదు
చాణక్య నీతి ప్రకారం ఒక సేవకుడు లేదా ఉద్యోగి తన పని వదిలి నిద్రపోతుంటే అతన్ని వెంటనే లేపాలి. లేకపోతే పని ఆగిపోయి యజమానికి నష్టం వస్తుంది. అతనికి కోపం వస్తే ఉద్యోగం కూడా పోయే ప్రమాదం కలుగుతుంది.
ఆకలితో నిద్రపోయే వ్యక్తిని లేపి భోజనం పెట్టాలి
ఎవరైనా ఆకలితో ఉన్న వ్యక్తి నిద్రపోతుంటే అతన్ని నిద్ర నుండి లేపి భోజనం పెట్టాలి. ప్రాణానికి శక్తి రావాలంటే ఆహారం చాలా అవసరం. సరైన ఆహారం లేకపోతే నిద్రలోనే మరణం సంభవిస్తుంది. అందువల్ల నిద్రలేపి భోజనం పెట్టడం చాలా మంచి పని అవుతుంది.
భయపడే వ్యక్తిని లేపి ధైర్యం చెప్పాలి
ఎవరైనా భయంతో నిద్రపోతున్నా లేదా నిద్ర నటిస్తున్నా అతన్ని నిద్ర నుండి లేపి ధైర్యం చెప్పాలి. వారికి ఏ విషయంలో భయం ఉందో తెలుసుకొని దాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాలి.
వంటవాడిని నిద్రపోనివ్వకూడదు
వంట చేసే వారు బద్ధకంగా పడుకుంటే నిద్ర లేపాలి. ఎందుకంటే వేల మందికి వంట చేసే బాధ్యత అతనిపై ఉంటుంది. అతను నిద్రపోతే చాలా మందికి ఆహారం దొరకదు.
వాచ్ మెన్ ను నిద్ర నుండి లేపాలి
కాపలాగా ఉండాల్సిన వ్యక్తి డ్యూటీలో నిద్రపోతుంటే వెంటనే నిద్ర లేపాలి. రాత్రంతా మేల్కొని కాపలా కావడం అంత సులభం కాదు. అందుకే కొన్నిసార్లు వాచ్ మెన్ తెలియకుండానే నిద్రపోతారు. ప్రజల వస్తువులను కాపాడటం అతని పని కాబట్టి డ్యూటీ టైమ్ లో అతను నిద్రపోతుంటే లేపాలి.
ఇది కూడా చదవండి ఫస్ట్ టైమ్ మీ పిల్లలను హాస్టల్ కి పంపుతున్నారా? ఈ విషయాలు నేర్పించండి