Ragi Java: ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ప్రస్తుత కాలంలో చాలామంది నేచురల్ ఫుడ్స్ వైపు మళ్లుతున్నారు. అలాంటి సూపర్ ఫుడ్స్ లో రాగి జావ ముందుంటుంది. రోజుకో గ్లాస్ రాగి జావ తాగితే జీర్ణక్రియ నుంచి ఎముకల ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.
రాగి జావ ఆరోగ్యానికి ఎంతమంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాగి జావలో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ ఒక గ్లాస్ రాగి జావ తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
26
ఎముకల ఆరోగ్యం
నిపుణుల ప్రకారం.. రాగి జావలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఉపయోగకరం. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు, మహిళలు, వృద్ధులు తగిన మోతాదులో రాగి జావను తీసుకుంటే ఎముకల సాంద్రత మెరుగుపడుతుంది. ఎముకల బలహీనత, కాల్షియం లోపం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో రాగి జావ చక్కగా సహాయపడుతుంది.
36
మలబద్ధకం దూరం
రాగి జావ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచి మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. పేగుల ఆరోగ్యం మెరుగుపడటంతో శరీరం పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా రాగి జావ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
రాగి జావలోని ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో తరచుగా తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారు లేదా ఆరోగ్యకరమైన బరువును కొనసాగించాలనుకునేవారు వైద్యుల సలహా మేరకు వారి ఆహారంలో రాగి జావను చేర్చుకోవచ్చు. అయితే ఇందులో అధికంగా చక్కెర లేదా బెల్లం కలిపితే కేలరీలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మితంగా ఉపయోగించడం మంచిది.
56
షుగర్ నియంత్రణ
రాగి జావలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల గ్లూకోజ్ శరీరంలో నెమ్మదిగా విడుదలవుతుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి. అయితే డయాబెటిస్ తో బాధపడుతున్నవారు వైద్యులు సూచించిన మోతాదులో మాత్రమే రాగి జావ తీసుకోవాలి.
66
చెడు కొలెస్ట్రాల్ దూరం
రాగి జావలో ఉండే ఫైబర్, మెగ్నీషియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడతాయి. ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది. అలాగే రక్తపోటు నియంత్రణకు అవసరమైన పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. అంతేకాదు రాగి జావలోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి.
అయితే రాగి జావ ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా, మితంగా తీసుకోవడం మంచిది. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తున్నవారు రాగి జావని రోజువారీ ఆహారంలో చేర్చే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.