Layoffs: ప్ర‌శ్నార్థ‌కంగా ఐటీ ఉద్యోగుల భ‌విత‌వ్యం.. ల‌క్ష‌ల ఉద్యోగాలు మ‌టాష్

Published : Sep 04, 2026, 02:52 PM IST

Layoffs: ప్రముఖ కంపెనీలు ఉద్యోగాల కోతలకు శ్రీకారం చుడుతున్నాయి. ఒరాకిల్‌ నుంచి రైడ్‌ హైలింగ్‌ దిగ్గజం ఉబర్‌ వరకు, డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేపాల్‌ నుంచి ఆటోమొబైల్‌ దిగ్గజం వోక్స్‌వ్యాగన్‌ వరకు ఉద్యోగుల‌ను తొల‌గించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాయి.

PREV
15
ఒరాకిల్‌లో సైలెంట్‌గా లేఆఫ్స్‌.. స్లాక్‌ ఖాతాలే సంకేతాలు

టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈసారి గతంలో కనిపించిన తరహాలో ఉద్యోగులకు ఒకేసారి తొలగింపు ఈ-మెయిల్స్‌ పంపకుండా సంస్థ భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి కంపెనీ నుంచి ఈ-మెయిల్‌ వచ్చిన తర్వాతే విషయం బయటకు వచ్చేది. కానీ తాజాగా కొంతమంది ఉద్యోగుల స్లాక్‌ ఖాతాలు ఒక్కసారిగా అందుబాటులో లేకుండా పోతున్నాయని ఒరాకిల్‌ ఉద్యోగుల ఆన్‌లైన్‌ కమ్యూనిటీల్లో చర్చ జరుగుతోంది. కంపెనీ ఈ-మెయిల్‌, అంతర్గత వ్యవస్థలకు యాక్సెస్‌ కూడా నిలిపివేస్తున్నట్లు కొందరు ఉద్యోగులు పేర్కొంటున్నారు.

రెడ్డిట్‌లోని ఒరాకిల్‌ ఉద్యోగుల కమ్యూనిటీలో అమెరికాలో లేఆఫ్స్‌ ప్రారంభమయ్యాయంటూ ఓ థ్రెడ్‌ చర్చకు వచ్చింది. తొలగింపులకు సంబంధించిన అధికారిక వివరాలు స్పష్టంగా బయటకు రాకపోవడంతో.. స్లాక్‌ గ్రూపుల్లో సభ్యుల సంఖ్య తగ్గడాన్ని ఉద్యోగులు గమనిస్తున్నట్లు సమాచారం. ఒరాకిల్‌ అప్లికేషన్‌ ల్యాబ్స్‌లోని పలువురు వైస్‌ ప్రెసిడెంట్లు, గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్థాయి ఉద్యోగులపై కూడా ప్రభావం పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విభాగాన్ని ఇటీవల ఒరాకిల్‌ క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (OCI)లో విలీనం చేసిన నేపథ్యంలో సంస్థాగత మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజా కోతలతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 7,000 నుంచి 10,000 మంది ఉద్యోగులపై ప్రభావం ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. భారత్‌లోనూ పలు విభాగాలకు చెందిన మేనేజర్లు ఈ పరిధిలోకి వచ్చినట్లు సమాచారం.

25
మార్చిలో భారీ కోతలు.. ఇప్పుడు మరోసారి ఉద్యోగుల్లో ఆందోళన

ఒరాకిల్‌ ఈ ఏడాది మార్చిలో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించింది. ఆ సమయంలో అమెరికా, భారత్‌, కెనడాలోని ఉద్యోగులకు ఉదయం 6 గంటల సమయంలో తొలగింపు సమాచారంతో ఈ-మెయిల్స్‌ పంపినట్లు వార్తలు వచ్చాయి. సెప్టెంబర్‌ ప్రారంభంలోనూ అదే విధానం కొనసాగుతుందని కొందరు ఉద్యోగులు భావించారు.. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అధికారిక మెయిల్స్‌ రాకముందే కంపెనీ అంతర్గత కమ్యూనికేషన్‌ వ్యవస్థల్లో యాక్సెస్‌ తొలగుతున్నట్లు ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతోంది. దీంతో సంస్థ నుంచి ఎంతమందిని తొలగించారనే విషయంపై స్పష్టత లేకపోయినా.. ఉద్యోగులు స్లాక్‌ ఛానళ్లలో సభ్యుల సంఖ్య, సహోద్యోగుల యాక్సెస్‌ వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వివరాలపై ఒరాకిల్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

35
ఉబర్‌లో 3,300 ఉద్యోగాలకు కోత.. మేనేజర్ల సంఖ్యలోనూ భారీ తగ్గింపు

రైడ్‌ హైలింగ్‌ రంగంలోని దిగ్గజ సంస్థ ఉబర్‌ కూడా పెద్ద స్థాయి పునర్వ్యవస్థీకరణకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,300 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం కావ‌డం గ‌మ‌నార్హం. సంస్థలో మేనేజ్‌మెంట్‌ స్థాయిలను తగ్గించడం, నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేయడం, నిర్వహణ వ్యవస్థను మరింత సరళీకరించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. మేనేజర్ల సంఖ్యను సుమారు 20 శాతం తగ్గించాలని నిర్ణయించినప్పటికీ.. ఆ స్థాయిలో ఉన్న ప్రతి ఉద్యోగి సంస్థను వీడాల్సిన అవసరం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. కొందరిని మేనేజీరియల్‌ బాధ్యతల నుంచి తప్పించి ఇతర విధుల్లోకి మార్చే అవకాశం ఉంది.

అయితే ఉద్యోగాల కోత కేవలం మేనేజ్‌మెంట్‌కే పరిమితం కాదు. ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిపైనా దీని ప్రభావం పడనుంది. భవిష్యత్‌ వ్యాపార అవకాశాల్లో పెట్టుబడులు పెంచుతూ సంస్థను తక్కువ స్థాయి నిర్వహణతో వేగంగా పనిచేసే విధంగా మార్చడమే లక్ష్యమని ఉబర్‌ సీఈవో దారా ఖోస్రోషాహి తెలిపారు. 2025 చివరి నాటికి ఉబర్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 34,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా నిర్ణయం అమలైతే సంస్థలోని సిబ్బంది సంఖ్య 30 వేల కంటే తక్కువకు చేరే అవకాశం ఉంది. కరోనా సమయంలో రైడ్‌ హైలింగ్‌ వ్యాపారం భారీగా దెబ్బతిన్న 2020లో సుమారు 6,700 ఉద్యోగాలను తగ్గించిన తర్వాత.. ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోతగా నిలవనుంది.

45
భారత్‌లో పేపాల్‌ ఉద్యోగులకు షాక్‌..

డిజిటల్‌ పేమెంట్స్‌ దిగ్గజం పేపాల్‌ కూడా ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తోంది. భారత్‌లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం పడినట్లు వార్తలు వెలువడ్డాయి. భారత్‌లో సుమారు 6 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్న పేపాల్‌.. దాదాపు 600 మందిని తొలగించినట్లు తొలుత సమాచారం వచ్చింది. అయితే సంస్థ భారత ప్రతినిధి మాత్రం లేఆఫ్స్‌ ప్రభావం సుమారు 220 మంది ఉద్యోగులపై పడిందని వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, ఆపరేషన్స్‌, పేమెంట్స్‌, ఫైనాన్స్‌ వంటి విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ పునర్వ్యవస్థీకరణ పరిధిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సంస్థ కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించడం, ప్రక్రియలను సరళీకరించడం, దీర్ఘకాలిక వృద్ధికి అనుగుణంగా సంస్థను సిద్ధం చేయడం ఈ నిర్ణయం వెనుక కారణాలుగా పేపాల్‌ పేర్కొన్నట్లు సమాచారం.

కొంతమంది ఉద్యోగులకు ముందస్తు సమాచారం లేకుండానే ఆగస్టు 31న కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా తొలగింపు విషయం తెలియజేసినట్లు తెలుస్తోంది. అనంతరం కంపెనీ సిస్టమ్స్‌కు వారి యాక్సెస్‌ను నిలిపివేసినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. మరికొందరికి ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఔట్‌బోర్డింగ్‌ ప్రక్రియతో పాటు ఒక నెల జీతం చెల్లించే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

55
వోక్స్‌వ్యాగన్‌లో లక్ష ఉద్యోగాల కోత.. ఆటో రంగంలో సంచలనం

ఉద్యోగాల కోతల ప్రభావం టెక్నాలజీ, డిజిటల్‌ పేమెంట్స్‌ రంగాలకే పరిమితం కాలేదు. జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ వోక్స్‌వ్యాగన్‌ కూడా భారీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను రూపొందించింది. 2030లోపు సంస్థలో సుమారు లక్ష ఉద్యోగాలను తగ్గించే దిశగా యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇప్పటికే 50 వేల ఉద్యోగాల కోతకు అంగీకారం ఉండగా.. అదనంగా మరో 50 వేల పోస్టులను తగ్గించే నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే ఇది సుమారు 15 శాతానికి సమానం.

చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ, అమెరికా వాణిజ్య సుంకాల ప్రభావం, ఈవీ మార్కెట్లో డిమాండ్‌లో వచ్చిన మార్పులు వోక్స్‌వ్యాగన్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖర్చులను నియంత్రించేందుకు సంస్థ భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. జర్మనీలోని హన్నోవర్‌, ఎమ్డెన్‌, స్వికావ్‌, నెకార్సుల్మ్‌ వంటి కీలక ప్లాంట్ల భవిష్యత్తుపైనా చర్చ మొదలైంది. ప్రత్యామ్నాయ వినియోగ మార్గాలను పరిశీలిస్తున్నామని సంస్థ చెబుతున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఏ ప్లాంట్‌ను పూర్తిగా మూసివేయాలనే నిర్ణయం తీసుకోలేదని కార్మిక సంఘాలు వెల్లడించాయి.

గతంలో జనరల్‌ మోటార్స్‌ దివాలా పరిస్థితుల్లో సుమారు 50 వేల ఉద్యోగాలను తొలగించిన ఘటనతో పోలిస్తే.. వోక్స్‌వ్యాగన్‌ ప్రణాళిక మరింత భారీ స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ పరిణామం ప్రపంచ ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఉద్యోగాల భద్రతపై కొత్త ఆందోళనలకు దారితీస్తోంది.

మొత్తంగా చూస్తే.. వ్యాపార ఖర్చులు, మారుతున్న మార్కెట్‌ పరిస్థితులు, ఆటోమేషన్‌, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి. భవిష్యత్‌ వృద్ధికి సంస్థలను సిద్ధం చేసుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే ఒకేసారి వేలాది ఉద్యోగాలు కోల్పోవడం ఆయా రంగాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories