పూజ 12వ తరగతి వరకు ఢిల్లీలో చదివారు. ఆ తర్వాత చదువు కోసం ఢిల్లీలో ఉండటం ఆర్థికంగా సాధ్యపడలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో జౌన్‌పూర్‌కు తిరిగి వచ్చి, టీడీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. చాలా మంది కలలు చెదిరిపోయే మలుపు ఇది, కానీ పూజ ఓటమిని అంగీకరించకుండా కొత్త అవకాశాలను వెతికారు.
పోటీ పరీక్షలు రాయాలనుకున్న పూజకు 2024లో ముఖ్యమంత్రి అభ్యుదయ యోజన గురించి తెలిసింది. ఆమె మే 2024లో ఈ పథకం ద్వారా సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకానికి ఎంపికైన పూజ జూన్ 2024 నుంచి ఉచిత కోచింగ్ పొందారు.
ఈ పథకం కింద ఆమెకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం లభించింది. రెగ్యులర్ క్లాసులు, పద్ధతి ప్రకారం సిలబస్, నిరంతర రివిజన్ ఆమె ప్రిపరేషన్‌ను పటిష్టం చేశాయి. కాలేజీ తర్వాత రోజూ సాయంత్రం గంటన్నర పాటు క్లాసులు పూజ దినచర్యలో భాగమయ్యాయి.
ఒకవేళ ప్రైవేట్ కోచింగ్ తీసుకోవాల్సి వస్తే రూ. 1 నుంచి 1.5 లక్షల వరకు ఖర్చయ్యేదని, అది తమ కుటుంబానికి అసాధ్యమని పూజ చెబుతున్నారు. అభ్యుదయ యోజన ఈ ఆర్థిక భారాన్ని పూర్తిగా తొలగించింది. నిరుపేద రైతుబిడ్డకు విజయాన్ని సాధించిపెట్టింది.