
చైనా అభివృద్ధి చేస్తున్న మిలిటరీ సాంకేతికతపై అమెరికా అధికారులందరూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ‘కిల్ వెబ్’ (Kill Web) పేరుతో అభివృద్ధి చేస్తున్న ఆధునిక యుద్ధ వ్యవస్థపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశారు. ఇది అంతరిక్షం, వాయు, సముద్రం, సైబర్ వ్యవస్థలన్నింటినీ అనుసంధానించి దాడి చేసే మల్టీ-డొమైన్ నెట్‌వర్క్ అని పేర్కొన్నారు.
‘కిల్ వెబ్’ అనేది సాధారణ ‘కిల్ చైన్’ కన్నా ఎంతో అధునాతనమైన వ్యవస్థ. సైనిక చర్యలలో ఇది నిర్ణయం తీసుకోవడం నుండి దాడి చేయడం వరకూ జరిగే చర్యలన్నింటినీ కేవలం కొన్ని సెకన్లలోనే పూర్తిచేసే శక్తిని కలిగి ఉంటుంది.
అంటే ఒకే సారి భూ, వాయు, సముద్ర రక్షణ దళాలను కలిపి సమన్వయంతో క్షణాల్లో జరిగే ఒక సైనిక చర్యగా చెప్పవచ్చు. చైనా ఇప్పటికే 470కిపైగా ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రికానిసెన్స్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా పిపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) శత్రు బలగాల స్థానాన్ని తక్షణమే గుర్తించి దాడి చేసే శక్తిని పొందింది.
PLA తైవాన్, ఫస్ట్ ఐలాండ్ చైన్, ఆస్ట్రేలియా వరకు లక్ష్యాలను తక్కువ సమయంలోనే చేరుకోగలదని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2025 మేలో జరిగిన భారత-పాకిస్థాన్ మధ్య వైమానిక ఘర్షణలో పాకిస్థాన్ పలు భారత రాఫేల్ యుద్ధ విమానాలను కూల్చేసిందని ప్రకటించింది. విశ్లేషకుల ప్రకారం దీని కోసం పాకిస్థాన్ చైనాలో అభివృద్ధి చేసిన ‘కిల్ చైన్’ వ్యవస్థను ఉపయోగించిందని అభిప్రాయపడుతున్నారు.
ఈ వ్యవస్థ ప్రకారం.. చాలా దూరంలో ఉన్న ఉన్న భూ ఆధారిత రాడార్లు భారత యుద్ధ విమానాలను గుర్తించాయి. తర్వాత జే-10 యుద్ధ విమానాలు మిసైళ్ళతో దాడికి వెళ్ళాయి. Erieye AWACS విమానాలు సురక్షితమైన డాటాలింక్స్ ద్వారా రియల్ టైమ్ సమాచారం పంపించాయి. దాడి సమయంలో భారత రాఫేల్ యుద్ధవిమానాలకు శత్రువులే కనిపించలేదని పేర్కొంటున్నారు. ప్రముఖ జర్నలిస్టు మెంఫిస్ బార్కర్ తెలిపిన ప్రకారం, భారత పైలట్లు మిసైల్ లాక్ చేసుకునేలోపు అవి దాడికి గురయ్యారు.
చైనా కిల్ వెబ్ కు వ్యతిరేకంగా అమెరికా తన వ్యవస్థలను సిద్ధం చేసుకుంటోంది. అమెరికా వైమానిక దళం (US Air Force), అంతరిక్ష దళం (Space Force) సంయుక్తంగా కొత్త టెక్నాలజీని రూపొందించడానికి చర్యలు చేపట్టాయి. దీనిలో భాగంగా మరింత శక్తివంతమైన ఎఫ్-47 నెక్స్ట్ జనరేషన్ ఫైటర్, బీ-21 రైడర్ బాంబర్, న్యూక్లియర్ శక్తి తో కూడి యుద్ధ విమానాలను తీసుకువస్తున్నాయి.
అంతేకాకుండా, అమెరికా సైబర్ భద్రతను మెరుగుపరచడం, ఆధునిక ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం, ఇప్పటికే ఉన్న ఎఫ్-35, ఎఫ్-15, బీ-52 వంటి విమానాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది.
అమెరికా సెనేట్ సబ్‌కమిటీ విచారణలో పాల్గొన్న అమెరికా ఎయిర్ ఫోర్స్ కార్యదర్శి ట్రాయ్ మైంక్, స్పేస్ ఫోర్స్ చీఫ్ జనరల్ ఛాన్స్ సాల్ట్జ్‌మన్ మాట్లాడుతూ.. చైనా ఇప్పటికే 900 కంటే ఎక్కువ షార్ట్ రేంజ్ మిసైళ్ళు, 400 ల్యాండ్ బేస్డ్ మిసైళ్ళు, 1300 మీడియం రేంజ్, 500 ఇంటర్మీడియట్, 400కి పైగా ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్ళు కలిగి ఉందని తెలిపారు.
సాల్ట్జ్‌మన్ ప్రకారం, ఈ మిసైల్ సామర్థ్యం ‘కిల్ వెబ్’ వ్యవస్థతో సమన్వయం చేసినందున అమెరికా బలగాల ఆందోళనలు పెరిగాయి.
స్టిమ్సన్ సెంటర్ నిర్వహించిన సెమినార్‌లో, పలువురు మిలిటరీ నిపుణులు తైవాన్‌పై చైనా యుద్ధ సన్నాహాలు, రాజకీయ, ఆర్థిక పరంగా తీసుకునే చర్యలను ప్రస్తావించారు. వారి అభిప్రాయం ప్రకారం, తైవాన్‌పై ఆంక్షలు లేదా బ్లాకేడ్ల ద్వారా అణిచివేయడమే బీజింగ్ ముఖ్య ఉద్దేశంగా ఉందని తెలిపారు.
గ్రేసియర్ మాట్లాడుతూ.. తైవాన్‌పై ఆమ్ఫిబియస్ దాడి చాలా ప్రమాదకరమైనదిగా ఉండే అవకాశం ఉంది. అణు యుద్ధం వరకు వెళ్లే ప్రమాదం ఉంది. సీబెన్స్ మాట్లాడుతూ.. చైనా రాజకీయ యుద్ధం, బలవంతపు మార్గాలతో ఉమ్మడి ప్రక్రియను చాలా కాలం నుంచి అమలు చేస్తోందన్నారు.
అమెరికా తదితర దేశాలు తమ ఆర్థిక ప్రయోజనాలను తైవాన్‌తో బంధించుకోవాలని నిపుణులు సూచించారు. తైవాన్‌పై మెరిన బ్లాకేడ్ విధించడం అంటే అంతర్జాతీయంగా కూడ మిత్ర దేశాలపై దాడి చేసినట్లే అవుతుందని హెచ్చరించారు.
ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియా సైన్యం కూడా ‘కిల్ వెబ్’ అనే సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఇది ‘మిలిటరీ ఇన్నోవేషన్స్ 4.0’లో భాగంగా అభివృద్ధి చేసిన వ్యవస్థ. ఇది ఏఐ ఆధారితంగా యుద్ధాలను తక్కువ సమయంలో తక్కువ నష్టంతో ముగించేందుకు ఉద్దేశించినది.
అంతర్గతంగా ఈ వ్యవస్థ నాలుగు దశలుగా పనిచేస్తుంది. వాటిలో సెన్సర్లను ఏర్పాటు చేయడం, సిగ్నల్స్ ట్రాక్ చేయడం, లక్ష్యాన్ని గుర్తించి దాడి చేయడం, దాడులను ధృవీకరించడం వంటి దశలు ఉంటాయి. ఇది చైనా అభివృద్ధి చేసిన మల్టీ-లేయర్డ్ నెట్‌వర్క్‌కు తో పొల్చదగిన వ్యవస్థగా రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.